పవన్ సినిమా అంటే వర్షాలేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఏదో ఒక అడ్డంకి ఎదురు కావడం కామన్ అయిపోయింది. పవన్ ప్రతిపక్షంలో ఉండగా రిలీజైన వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో చిత్రాలకు టికెట్ల ధరల విషయంలో ఎదురైన ఇబ్బందుల గురించి తెలిసిందే. ఇక గత ఏడాది ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ ముంగిట చాలా అడ్డంకులే దాటాల్సి వచ్చింది. ఫైనాన్స్, బిజినెస్ సమస్యలకు తోడు.. వర్షాలు కూడా ఆ చిత్రానికి తీవ్ర ఇబ్బంది కలిగించాయి.

పీక్ రెయినీ సీజన్లో రిలీజైన ఆ చిత్రం మీద వర్షాలు ప్రతికూల ప్రభావం చూపించాయి. తర్వాత సెప్టెంబరులో ‘ఓజీ’ విడుదలైతే.. అప్పుడు కూడా వర్షం బెడద తప్పలేదు. అప్పటికి వర్షాకాలం పూర్తి కావాలి కానీ.. గత ఏఢాది వానలు సుదీర్ఘ కాలం పడడంతో ‘ఓజీ’కి కొంత ఇబ్బంది తప్పలేదు. ఐతే పవన్ కొత్త సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు వాతావరణ పరంగా ఏ ఇబ్బందీ ఉండదని అనుకుంటే.. షాక్ తప్పేలా లేదు.

మార్చిలో వర్షాల జాడే ఉండదు మామూలుగా. కానీ ఈసారి మాత్రం ఈ నెల మూడో వారంలో అకాల వర్షాలు పడబోతున్నాయి. ఫిబ్రవరిలో రెండు మూడు రోజులు హైదరాబాద్‌ సహా తెలంగాణలో అకాల వర్షాలు పడి జనం ఇబ్బంది పడ్డారు. కొంచెం బ్రేక్ తర్వాత మార్చి 18, 19 తేదీల్లో భారీ వర్షాలు పడబోతున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

17వ తేదీ వరకు వాతావరణం పొడిగానే ఉంటుందట. కానీ తర్వాతి రెండు రోజులు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడబోతున్నట్లు సమాచారం బయటికి వచ్చింది.
‘ఉస్తాద్..’కు ముందు రోజే పెయిడ్ ప్రిమియర్స్ వేయాలని చూస్తున్నారు. ఆ రోజే కాక.. రిలీజ్ డే కూడా అకాల వర్షాల వల్ల తెలంగాణలో ‘ఉస్తాద్..’ షోలకు ఇబ్బంది తప్పకపోవచ్చు.

సమ్మర్ సీజన్లో పవన్ సినిమాను రిలీజ్ చేస్తున్నా ఇలా వర్షాల బెడద తప్పకపోవడం విడ్డూరమే. మార్చి 26కు అనుకున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను వారం ముందుకు జరిపి మార్చి 19న రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించిన వెంటనే ఈ అకాల వర్షాల అప్‌డేట్ బయటికి రావడం గమనార్హం.