అగ్ర నిర్మాణ సంస్థకు అంతులేని అడ్డంకులు

ఈ మధ్య కాలంలో దక్షిణాదిలో బాగా వినిపిస్తున్న నిర్మాణ సంస్థ పేరు కెవిఎన్ ప్రొడక్షన్స్. వందల కోట్ల బడ్జెట్ తో క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్న ప్రొడక్షన్ హౌస్ గా బెంగళూరు నుంచి హైదరాబాద్ దాకా దీని పేరు బాగానే వినిపిస్తోంది. అయితే వరసగా వస్తున్న అడ్డంకులు సదరు నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. జనవరిలో ‘జన నాయకుడు’ వాయిదా పడ్డాక ఇప్పటికీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి కాక, కొత్త రిలీజ్ డేట్ తేలక అంతకంతా విజయ్ అభిమానుల్లో టెన్షన్ పెరుగుతూనే ఉంది.

అడ్వాన్సులు ఇచ్చిన బయ్యర్లతో మొదలుకుని అగ్రిమెంట్ చేసుకున్న ఓటిటి కంపెనీ దాకా ఒత్తిడి అన్ని రూపాల్లో ఉంది. ఇది నడుస్తుండగానే తాజాగా ‘టాక్సిక్’ ఏకంగా మూడు నెలలు పోస్ట్ పోన్ కావడం మరో దెబ్బని చెప్పాలి. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల వాయిదా వేసినప్పటికీ దీని వల్ల కలగబోయే వడ్డీల భారం మాములుగా ఉండదు. ఒకవేళ అనుకున్న టైం మార్చి 19కే రిలీజ్ చేసి ఉంటే రెవిన్యూ రూపంలో పెద్ద ఎత్తున సొమ్ము కెవిఎన్ అకౌంట్లకు వచ్చి ఉండేది. కానీ అలా జరగలేదు.

ఇదిలా ఉండగా ధృవ్ సర్జతో తీసిన ‘కెడి ది డెవిల్’ సంవత్సరన్నర కాలంగా నిర్మాణంలోనే ఉంది. సంజయ్ దత్ . శిల్పా శెట్టి, రవిచంద్రన్, రమేష్ అరవింద్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ఉన్నా మోక్షం ఎప్పుడు దక్కుతుందో శాండల్ వుడ్ వర్గాలకు అంతు చిక్కడం లేదు. తాజాగా మే రిలీజ్ అంటున్నారు. వీటి సంగతలా ఉంచితే చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో తలపెట్టిన యాక్షన్ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ లాకైపోయింది. మార్చి 14 నుంచి షూట్ ప్రారంభిస్తారని ఇన్ సైడ్ టాక్. అఫీషియల్ గా ఈ వారంలోనే న్యూస్ రావొచ్చు. దీనికి పైన చెప్పినన్ని ఇబ్బందులు రాకపోవచ్చని మెగా ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు.

వాల్తేరు వీరయ్య కాంబినేషన్ కనక మరోసారి మాస్ మేజిక్ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. హోంబాలే ఫిలింస్ కు గట్టి పోటీ ఇస్తుందని భావించిన కెవిఎన్ ప్రొడక్షన్స్ ఇలా ముళ్లపొదలను దాటుకుంటూ గమ్యం వైపు వెళ్లడం పెద్ద సవాల్ గా మారిపోయింది. ఇన్ని ఇబ్బందులు తలెత్తడం వల్లే ఇంతకు ముందు ఫిక్స్ చేసుకున్న క్రేజీ కాంబోస్ కొన్ని పెండింగ్ లో పెట్టినట్టు సమాచారం. ఇవన్నీ వీగిపోవాలంటే ముందు జన నాయకుడు బ్లాక్ బస్టర్ అవ్వాలి, టాక్సిక్ అనుకున్న దానికి మించి కెజిఎఫ్ రేంజ్ లో మేజిక్ చేయాలి.