సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి సరైన సినిమా కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు అభిమానులు. వాళ్లు కోరుకునే సినిమాలాగే కనిపిస్తోంది అన్నాత్తె. తెలుగులో పెద్దన్న పేరుతో రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్, పాటలు చాలా కలర్ ఫుల్‌గా, మాస్-ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా కనిపించాయి.
ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. అది కూడా చాలా కలర్ ఫుల్‌గానే సాగింది. ఒక కమర్షియల్ సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలూ ఇందులో ఉన్నట్లే కనిపించాయి. కాస్టింగ్ దగ్గర్నుంచి మేకింగ్ వరకు భారీతనానికి కేరాఫ్ అడ్రస్‌లాగా కనిపించిందీ సినిమా. మామూలుగా రజినీ సినిమాలో ఆయనే ప్రధాన ఆకర్షణగా ఉంటారు. ఇందులోనూ ఆయన ఆకర్షణకేమీ లోటు లేదు. కానీ ఆయనతో పాటు ఆర్టిస్టుల పరంగా ప్యాడింగ్ చాలా గట్టిగానే చేయడం విశేషం.
రజినీకి జోడీగా నయనతార.. ఆయన చెల్లెలిగా కీర్తి సురేష్.. వీళ్లిద్దరూ చాలదన్నట్లు నిన్నటి తరం తారలు మీనా, ఖుష్బూ.. ఇలా రజినీ చుట్టూ పేరున్న లేడీ క్యారెక్టర్లు చాలానే ఉన్నాయి. మరోవైపు విలన్ గ్యాంగ్ కూడా చాలా పెద్దదే ఇందులో.
మెయిన్ విలన్‌గా జగపతిబాబు భీకరమైన అవతారంలో కనిపిస్తున్నారు. అంతే కాక ప్రకాష్ రాజ్ లాంటి దిగ్గజ నటుడు కూడా నెగెటివ్ రోల్ చేశాడు. నరసింహా సినిమాలో కలిసి నటించాక 21 ఏళ్లకు రజినీ, ప్రకాష్ రాజ్ కలిసి తెరపై కనిపించనున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇంకా గబ్బర్ సింగ్ విలన్ అభిమన్యు సింగ్ కూడా ఉన్నాడు. ఇక కామెడీ పరంగా కూడా సందడి తక్కువేమీ కాదు. తమిళంలో టాప్ కమెడియన్లయిన సూరి, సతీష్, ఇంకా కొంతమంది రజనీ పక్కనే ఉండి కావాల్సినన్ని పంచులు వేసేలా కనిపిస్తున్నారు.
మొత్తంగా ఈ తారాగణం కోసమే ప్రేక్షకులకు థియేటర్లకు వచ్చేలా ఉంది. రజినీ సినిమాలో ఈ స్థాయిలో స్టార్ కాస్ట్ ఉండటం అరుదైన విషయమే. ఇక ఒక కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన యాక్షన్, సెంటిమెంట్, కామెడీ.. ఇలా ప్రతి రసమూ బాగానే దట్టించినట్లున్నాడు దర్శకుడు శివ. సాంకేతిక ఆకర్షణలు, భారీతనానికీ లోటు లేదు. సూపర్ స్టార్‌కు ఒక భారీ విజయం చాలా అవసరమైన నేపథ్యంలో దర్శకుడు శివ ప్యాడింగ్ చాలా గట్టిగా చేసుకున్నట్లున్నాడు.