మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సందర్భంగా గతంలోనూ ప్రధాన పోటీదారుల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు.. ఆరోపణలు ప్రత్యారోపణలు చూశాం. కానీ ఈసారి జరిగినంత రభస మాత్రం ఎప్పుడూ జరగలేదు. కేవలం ఎన్నికల్లో పోటీ పడ్డ వాళ్లే కాదు.. వాళ్లకు మద్దతుగా నిలిచిన బయటి వ్యక్తులు కూడా పరస్పరం తీవ్ర దూషణలకు దిగారు. ఒకరిపై ఒకరు విరుచుకుపడిపోయారు.
ప్రకాష్ రాజ్‌కు మద్దతుగా నిలిచిన మెగా బ్రదర్ నాగబాబు.. మంచు విష్ణుకు మద్దతుగా మాట్లాడిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుపై ఎన్నికల ముంగిట ఒక ఇంటర్వ్యూలో దారుణమైన వ్యాఖ్యలే చేశారు. కోటను వాడు వీడు అని సంబోధిస్తూ.. మనిషి కాదు పశువు అనేశాడు. నటన విషయంలో కోట.. ప్రకాష్ రాజ్ కాలి గోటికి కూడా సరిపోడని, ప్రకాష్ రాజ్ అంటే కోటకు అసూయ అని.. ఇలా చాలా చాలా కామెంట్లే చేశాడు నాగబాబు.
ఈ వ్యాఖ్యలు ఎవ్వరికీ రుచించలేదు. ప్రకాష్ రాజ్ వైపు ఉన్న వాళ్లు సైతం ఈ వ్యాఖ్యల విషయంలో నాగబాబును తప్పుబట్టిన వాళ్లే. నాగబాబు కామెంట్స్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్‌కు డ్యామేజ్ చేశాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. కాగా ఇప్పుడు కోట.. నాగబాబు వ్యాఖ్యలపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తన అన్నదమ్ములు చిరంజీవి, పవన్ కళ్యాణ్ తన పక్కన లేకుంటే నాగబాబు ఎవరు అని ఆయన ప్రశ్నించారు. వాళ్లిద్దరూ లేకుంటే నాగబాబు ఒక సామాన్య నటుడు మాత్రమే అని కోట అన్నారు.
గతంలో నాగబాబు.. ప్రకాష్ రాజ్‌కు వ్యతిరేకంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని.. తాను నాగబాబును ఎప్పుడూ ఏమీ అనలేదని.. కానీ ఇప్పుడు తన గురించి ఎందుకిలా మాట్లాడారో అర్థం కావడం లేదని కోట అన్నారు. ఎన్నికల సమయంలో నాగబాబు వ్యాఖ్యలపై తాను స్పందించలేదని, అలా చేస్తే మీడియా తనను అనవసర వివాదంలోకి లాగేదని కోట అభిప్రాయపడ్డారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates