వివాహ భోజ‌నంబు.. త‌మిళంలోకి

క‌మెడియ‌న్ స‌త్య క‌థానాయికుడి ప‌రిచ‌యం అయిన సినిమా వివాహ భోజ‌నంభు. ఈ చిత్రాన్ని నిర్మించింది యంగ్ హీరో సందీప్ కిష‌న్ కావ‌డం విశేషం. వివాహ భోజ‌నంబు పేరుతో రెస్టారెంట్లు న‌డుపుతున్న సందీప్.. అదే పేరు పెట్టి త‌న నిర్మాణంలో సినిమా తీశాడు. రామ్ అబ్బ‌రాజు అనే అత‌డి మిత్రుడు ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారాడు. సందీప్ ఇందులో ఒక క్యామియో రోల్ కూడా చేయ‌డం విశేషం.

ప‌ర‌మ పిసినారి అయిన కుర్రాడి ఇంట్లోకి కొవిడ్ టైంలో హీరోయిన్ ఫ్యామిలీ అంతా వ‌చ్చి అక్క‌డే తిష్ట వేస్తే అత‌ను ఎదుర్కొన్న ఇబ్బందుల నేప‌థ్యంలో వినోదాత్మ‌కంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. కామెడీ ఓ మోస్త‌రుగా వ‌ర్క‌వుట్ అయిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్ష‌కుల నుంచి ఓ మోస్త‌రు స్పంద‌న వ‌చ్చింది.

ఉత్త‌రాదిన ఫేమ‌స్ అయిన సోనీ లివ్ ఓటీటీ తెలుగులోకి ఈ చిత్రంతోనే అడుగు పెట్టింది. థియేట‌ర్ల‌లో రిలీజై ఉంటే సినిమా హిట్టో ఫట్టో చెప్ప‌గ‌లిగేవాళ్లం. కానీ ఓటీటీ మూవీ కాబ‌ట్టి దీనిపై ఒక అంచ‌నాకు రావ‌డం క‌ష్ట‌మే. అయితే చిత్ర బృందం మాత్రం ఇది సూప‌ర్ హిట్టని.. అందుకే త‌మిళంలోకి కూడా రీమేక్ అవుతోంద‌ని అంటోంది. సూర్య క‌జిన్, ప్ర‌ముఖ కోలీవుడ్ నిర్మాత జ్ఞాన‌వేల్ రాజా ఈ సినిమా త‌మిళ రీమేక్ హ‌క్కులు తీసుకున్నట్లుగా నిర్మాత సందీప్ కిష‌న్ వెల్ల‌డించాడు.

అక్క‌డ సంతానం, యోగిబాబు లాంటి వాళ్ల‌కు ఈ స‌బ్జెక్ట్ బాగానే సూట్ కావ‌చ్చు. ఈ క‌థ‌కు ఇంకొంచెం మెరుగులు దిద్దుకుని, కామెడీ బాగా వ‌ర్క‌వుట్ చేస్తే త‌మిళంలో ఈ సినిమా మంచి విజ‌యం సాధించేందుకు అవకాశ‌ముంది. మొత్తానికి త‌క్కువ బ‌డ్జెట్లో సినిమా పూర్తి చేసి మంచి లాభానికే సోనీ లివ్ వాళ్ల‌కు అమ్మేసిన సందీప్ కిష‌న్.. రీమేక్ హ‌క్కుల ద్వారా కూడా అద‌న‌పు ఆదాయం అందుకోవ‌డం విశేష‌మే.