‘మా’ ఎన్నికల్లో విష్ణు ఎలా గెలుస్తాడో చెప్పిన మోహన్ బాబు

రీల్ మించిన రియల్ స్టోరీ మాదిరి మారింది ‘మా’ ఎన్నికల వ్యవహారం. ప్రకాశ్ రాజ్ ఎంట్రీ.. తర్వాత మంచు విష్ణు.. ఆర్వాత మరికొందరు.. అనంతరం పలువురు వెనక్కి వెళ్లిపోగా.. ఇప్పుడు ముఖాముఖిన ప్రకాశ్ రాజ్ వర్సస్ మంచు విష్ణు అన్నట్లుగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన మోహన్ బాబు.. తన కుమారుడు ‘మా’ ఎన్నికల బరిలోకి ఎందుకు దిగారు? ఇప్పుడు ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయన్న దానిపై క్లారిటీ ఇవ్వటమే కాదు.. విష్ణు గెలుపు పక్కా అని బల్లగుద్ది చెబుతున్నారు.

అంతేకాదు.. విష్ణు గెలుపు మీద అనుమానం అక్కర్లేదని.. ఆయన ఎలా గెలుస్తారో కూడా వివరంగా చెప్పేశారు మోహన్ బాబు. ‘మా’ ఎన్నికలకు సంబంధించి సదరు ఇంటర్వ్యూలో మోహన్ బాబు చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు చూస్తే..

  • పంచభూతాల సాక్షిగా చెబుతున్నాను. విష్ణుని పోటీలో నిలబెట్టాలని ఆలోచనే లేదు. సడన్‌గా విష్ణు ఒకరోజు డాడీ ‘గురువుగారు అడిగినప్పుడు మీరు వద్దన్నారు. ఇప్పుడు ఉంటే బెటర్‌ కదా’ అని అడిగాడు. కాలేజీ చూసుకోవాలి. సినిమాల్లో యాక్ట్‌ చేయాలి. నలుగురు బిడ్డల తండ్రి. ఇన్ని బాధ్యతలు ఉన్నాయి. ఏకగ్రీవంగా అయితే బాగుంటుంది అనిపించి ఒకరిద్దరి ఫోన్‌ నంబర్లు ఇచ్చి మాట్లాడమన్నా. ఇప్పుడు ఇంకొకరు వచ్చారు. అది నేను ఊహించలేదు.
  • (ప్రకాశ్ రాజ్ పేరు ప్రస్తావించకుండా) ఐ డోన్ట్‌ వాంట్‌ టు సే హిజ్‌ నేమ్‌. వాళ్లకు నా జాతకం తక్కువ తెలుసు. కానీ వాళ్ల జాతకాలు నాముందు పేజీ బై పేజీ ఉన్నాయి. కానీ ఒక పెద్దరికం, ఒక ఎడ్యుకేషనలిస్టుగా, విద్యాసంస్థల చైర్మన్‌గా నేను వాళ్ల జీవితాల గురించి మాట్లాడదలుచుకోలేదు. పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది. ఎవరికి వారే గొప్ప అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాట్లాడనివ్వండి. సామెత ఉంది కదా! ‘మదగజంబు మార్గమున వెళుచుండ కుక్కలెన్ని మొరుగుట లేదని!’ కుక్కలు మొరుగుతుంటాయి. ప్రతి కుక్కకూ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.
  • చిరంజీవి ఎప్పటికీ స్నేహితుడే! చిరంజీవి బిడ్డ నాకు బిడ్డ లాంటి వాడే. అరవింద్‌ పిల్లలు నా బిడ్డలాంటివారే. నాగబాబు పిల్లలూ అంతే. ఆ కుటుంబంలోని బిడ్డలెవరైనా నిలబడి ఉంటే, చిరంజీవి అలా అడిగి ఉంటే వెంటనే విష్ణును విత్‌డ్రా చేసుకొమ్మని చెప్పే వాణ్ణి.
  • ప్రకాశ్ రాజు స్నేహితుడు కాదు. స్నేహితుడు అంటే రజనీకాంత్‌, అంబరీష్‌. కష్టసుఖాల్లో పాలుపంచుకొనేవాడు స్నేహితుడు. స్నేహితుల్లో చాలా రకాలుంటారు. మేమందరం సినిమా స్నేహితులం.
  • ‘‘మా’ కోసం బిల్డింగ్‌ కావాలంటున్నారు. అది నేను కట్టిస్తా. సినిమా పెద్దలను కలిసి ఏకగ్రీవం చేయమనండి’ అని విష్ణుబాబు అడిగాడు. పెద్దలెవరూ స్పందించలేదు. తరువాత విష్ణుని తీసుకెళ్లి కృష్ణగారి బ్లెస్సింగ్స్‌ తీసుకొమ్మన్నా.
  • నేను మా సభ్యులందరికీ ఫోన్‌ చేశాను. దాదాపు 700 మందికి ఫోన్‌ చేశాను. మీకు మంచే జరుగుతుంది అని చెప్పా. ఇంత చేశాక చికాకు కలిగి వెనక్కి రావడం అన్నది కరెక్ట్‌ కాదు. విష్ణు గెలుస్తాడు. అందులో సందేహమే లేదు.