పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇందులో రానా కూడా నటిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే-మాటలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కానీ ఉన్నట్టుండి ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఓటీటీ నుంచి ఈ సినిమాకి మంచి డీల్ వచ్చిందని.. సో నిర్మాతలు డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొట్టింది.
దీంతో అలెర్ట్ అయిన చిత్రయూనిట్ వెంటనే ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రనిర్మాత నాగవంశీ ట్విట్టర్ వేదికగా మరోసారి సినిమా రిలీజ్ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను జనవరి 12, 2022లో థియేటర్లో మాత్రమే విడుదల చేస్తామని.. అహంకారానికి.. ఆత్మగౌరవానికి మధ్య జరిగే యుద్ధాన్ని చూడడానికి సిద్ధంగా ఉండండి అంటూ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ తో ఓటీటీ రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.
నిజానికి ఇప్పటికే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్, ఆడియో రైట్స్ రికార్డ్ మొత్తానికి అమ్మేశారు. మిగిలిన శాటిలైట్, డిజిటల్ ఇతర హక్కులను రూ.70 కోట్ల రేంజ్ లో అమ్మడానికి చూస్తున్నారు. ఇక థియేట్రికల్ హక్కులు రెండు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి దాదాపు రూ.80 కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇంత బిజినెస్ జరుగుతోన్న సినిమాను ఓటీటీకి ఇచ్చే ఛాన్స్ లేదని తేల్చి చెప్పేసింది చిత్రబృందం.