శనివారం రాత్రి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అంటే.. ‘రిపబ్లిక్’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో పవర్ స్లార్, జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగమే. పవన్ ఇంత ఆలోచనతో, ఆవేశంతో.. ఇంత ఘాటైన ప్రసంగం చేసి చాలా కాలం అయింది. ఆయన పొలిటికల్ కెరీర్లోనే అత్యుత్తమ ప్రసంగాల్లో ఇదొకటి అనడంలో సందేహం లేదు. ఆయన ప్రసంగంలో కొన్ని లోపాలుండొచ్చు. కొన్ని వర్గాలకు రుచించని మాటలు మాట్లాడి ఉండొచ్చు. కానీ వివిధ అంశాలపై తానేం చెప్పదలుచుకున్నాడో అది మాత్రం సూటిగా, సుత్తి లేకుండా, చాలా ఎఫెక్టివ్‌గా చెప్పగలిగాడు.
ముఖ్యంగా తనను దెబ్బ తీయడం కోసం మొత్తం సినీ పరిశ్రమను జగన్ సర్కారు ఇబ్బందుల్లోకి నెట్టిందనే విషయాన్ని చాలా బలంగా పవన్ జనాల్లోకి తీసుకెళ్లగలిగాడు. మామూలుగా సినీ జనాలు అధికారంలో ఉన్న వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. రాజకీయాలతో టచ్ ఉన్న వాళ్లు కూడా ఆచితూచి వ్యవహరిస్తుంటారు. కానీ పవన్ మాత్రం ఈసారి అలాంటి పరిమితులేమీ పెట్టుకోకుండా వైసీపీ సర్కారును కడిగి పారేశాడు.
ఐతే జగన్ సర్కారు తీరును ఏకిపడేస్తూ పవన్ చేసిన ఈ స్పీచ్ వల్ల ఇండస్ట్రీకి మంచా చెడా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఓవైపు పవన్ అన్నయ్య చిరంజీవి ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం జగన్ సర్కారుతో చాలా జాగ్రత్తగా, మర్యాదగా, గౌరవ పూర్వకంగా వ్యవహరిస్తూ చాలా జాగ్రత్తగా వ్యవహారం నడుపుతూ వస్తున్నారు. మొన్నటి ‘లవ్ స్టోరి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో తన స్థాయి గురించి ఆలోచించకుండా సమస్యల పరిష్కారం కోసం రెండు తెలుగు రాష్ట్రాల అధినేతల్ని వేడుకున్నట్లుగానే మాట్లాడారు చిరు. వేరే సినీ పెద్దలు కూడా ప్రభుత్వ పెద్దల దగ్గర ఎంతో తగ్గి, వినయంతో వ్యవహరిస్తూ సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇండస్ట్రీ జనాలు ఇలా తగ్గి మాట్లాడటం, కాళ్ల బేరానికి రావడం ఏపీ ప్రభుత్వ పెద్దలకు బాగానే సంతోషాన్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి సుముఖంగానే ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. కాకపోతే నిర్ణయం తీసుకోవడంలో కొంచెం ఆలస్యమవుతోంది. దసరా లోపు ఈ మేరకు జీవోలు వస్తాయన్న ఆశతో ఉన్నారు సినీ జనాలు. కానీ ఇంతలో పవన్.. జగన్ సర్కారును సంచలన రీతిలో టార్గెట్ చేశాడు. పవన్ విమర్శలు, ఆరోపణలు చాలా సహేతుకంగానే కనిపించాయి చాలామందికి. అతను జగన్ సర్కారును నిలదీసిన తీరు చాలామందికి మంచి కిక్ ఇచ్చింది. పవన్ భలే మాట్లాడాడు.. భలేగా నిలదీశాడు అని అతణ్ని పొగుడతున్నారు.
కానీ అధికారంలో ఉన్న వాళ్ల ఇగోను ఈ వ్యాఖ్యలు ఎంత దెబ్బ తీస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ జగన్ అండ్ కో ఇగో గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు కనుక ఇండస్ట్రీకి అనుకూల నిర్ణయాలు తీసుకుంటే.. పవన్‌కు భయపడి అలా చేశారన్న అభిప్రాయం కలగొచ్చు జనాలకు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఇంకా మొండి పట్టుదలకు పోతుందేమో, ఇండస్ట్రీని మరింతగా ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తుందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates