గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న కోలీవుడ్ హీరో సూర్య ఈసారి తెలుగు టీమ్ తో చేతులు కలిపాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ వచ్చే జూలైలో విడుదల కాబోతోంది. సార్, లక్కీ భాస్కర్ హిట్లతో దూకుడు మీదున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈసారి తమిళ స్టార్ తో రాబోతున్నాడు. ఇప్పటి దాకా రివీల్ చేయని కాన్సెప్ట్ ని టీజర్ రూపంలో ఇవాళ పరిచయం చేశారు.
రైఫిల్ షూటింగ్ లో తిరుగు లేని ఆటగాడు సంజయ్ విశ్వనాథ్ (సూర్య). నలభై వయసు దాటాక చూపులో చురుకుదనం తగ్గిపోయి పట్టు తప్పుతాడు. ఆ సమయంలో పరిచయమైన ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయి (మమిత బైజు) తనకు బాగా దగ్గరవుతుంది. అల్లరిగా మొదలైన స్నేహం కాస్తా ప్రేమగా మారుతుంది. అయితే ఇంత ఏజ్ గ్యాప్ ఉండటంతో విశ్వనాథ్ వద్దంటాడు. అయినా సరే ఈ లవ్ స్టోరీ ఆగదు. ఇంతకీ సూర్య గతం ఏమిటనేది తెరమీద చూస్తే అర్థమవుతుంది.
చిన్న టీజర్ అయినప్పటికీ కాన్సెప్ట్ ఏంటో విడమరిచి చెప్పేశారు. ఒకప్పుడు బాలీవుడ్ లో యష్ చోప్రా లమ్హేలో ఇలాంటి పాయింట్ ఒకటి టచ్ చేశారు. కాకపోతే అందులో హీరో అనిల్ కపూర్ జోడిగా తల్లి కూతుళ్ళ పాత్రలను శ్రీదేవినే పోషించడంతో ప్రేక్షకులు అంగీకరించలేదు. కానీ విశ్వనాథ్ అండ్ సన్స్ లో ఆ సమస్య లేదు. అయితే అతని పూర్వ జీవితంలో భార్య ఎవరు, ఒళ్ళో సూర్య ఎత్తుకున్న చిన్న పిల్లడు ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానం సస్పెన్సే.
వయసుకు తగ్గ పాత్రలో సూర్య హుందాగా ఉండగా బొమ్మరిల్లు హాసిని తరహాలో మమిత బైజుకు పెర్ఫార్మన్స్ చేసే అవకాశం దక్కింది. వెంకీ అట్లూరి ఫ్యామిలీ మార్కు ఫ్రేమ్స్ తో వీడియో ఆహ్లాదంగా ఉంది. కాకపోతే సూర్య, మమిత మధ్య లవ్ ని ఎంత కన్విన్సింగ్ గా ఎస్టాబ్లిష్ చేశారనేది తెరమీద చూడాలి. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ ఎమోషనల్ డ్రామాలో రాధికా శరత్ కుమార్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. సూర్య మరో మూవీ కరుప్పు అనౌన్స్ మెంట్ తర్వాత విశ్వనాధ్ అండ్ సన్స్ డేట్ ఫిక్స్ అవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates