ఓటీటీలోకి రంగ‌మార్తాండ‌?


తెలుగు సినిమా న‌డ‌త‌ను మార్చి ట్రెండ్ క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుల్లో కృష్ణ‌వంశీ ఒక‌డు. క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా గొప్ప పేరు సంపాదించిన కృష్ణ‌వంశీ.. గ‌త ద‌శాబ్ద కాలంలో త‌న స్థాయికి త‌గ్గ సినిమాలు తీయ‌లేక‌పోయాడు. చంద‌మామ‌నే చివ‌ర‌గా ఆయ‌న్నుంచి వ‌చ్చిన హిట్ మూవీ. ఆ త‌ర్వాత వ‌చ్చిన సినిమాల గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయ‌న కొన్నేళ్ల విరామం త‌ర్వాత రంగ‌మార్తాండ అనే సినిమా మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. నానా ప‌టేక‌ర్ న‌టించిన మ‌రాఠి చిత్రం న‌ట‌సామ్రాట్‌కు ఇది రీమేక్.

ఐతే మొద‌లుపెట్టి రెండేళ్లు కావ‌స్తున్నా ఈ చిత్రం ఇంకా పూర్తి కాలేదు. అందుకు కరోనా మాత్ర‌మే కాక వేరే కార‌ణాలు కూడా ఉన్నాయి. చాన్నాళ్ల నుంచి అస‌లు ఈ సినిమా గురించి అప్‌డేట్ అన్న‌దే లేదు. షూటింగ్ ఏ ద‌శ‌లో ఉన్న‌దీ కూడా వెల్ల‌డి కాలేదు. రిలీజ్ గురించి కూడా స‌మాచారం లేదు.

ఐతే కృష్ణ‌వంశీ తాజాగా రంగ‌మార్తాండ గురించి అప్‌డేట్ ఇచ్చాడు. ఈ సినిమాను డిసెంబ‌రులో రిలీజ్ చేయాల‌నుకుంటున్న‌ట్లు చెప్పాడు. ఐతే చిత్ర వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం రంగ‌మార్తాండ షూటింగ్ దాదాపు పూర్తి కావ‌చ్చింద‌ని.. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే యోచ‌న‌లో నిర్మాత ఉన్నార‌ని తెలుస్తోంది. ఈ చిత్రం మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఏమంత బ‌జ్ లేదు. కృష్ణ‌వంశీ ట్రాక్ రికార్డు అందుకు ముఖ్య కార‌ణం. అలాగే స్టార్ ఆక‌ర్ష‌ణ లేక‌పోవ‌డం కూడా సినిమాకు మైన‌స్.

ఈ నేప‌థ్యంలో థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం ఆశించిన ఆఫ‌ర్లేమీ రావ‌ట్లేద‌ని.. దీంతో బడ్జెట్ మీద ఓ మోస్త‌రు లాభానికి ఓటీటీ ఆఫ‌ర్ వ‌స్తే సినిమాను అమ్మేద్దామ‌ని చూస్తున్నార‌ని అంటున్నారు. సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయ‌ని, త్వ‌ర‌లోనే డీల్ క్లోజ్ అయ్యే అవ‌కాశం కూడా ఉంద‌ని చెబుతున్నారు. మ‌రి ఈ సినిమాను కొని రిలీజ్ చేసే ఓటీటీ ఏదో చూడాలి.