అయినా స‌రే.. రిప‌బ్లిక్ ఆ రోజే

సాయిధ‌ర‌మ్ తేజ్ కొత్త చిత్రం రిప‌బ్లిక్ సినిమాను అక్టోబ‌రు 1న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చాన్నాళ్ల ముందే ప్ర‌క‌టించారు. ఈ సినిమా షూటింగ్ రెండు నెలల ముందే పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు సైతం కొన్ని రోజుల కింద‌టే అయిపోయాయి. ఫ‌స్ట్ కాపీ కూడా రెడీ చేసేశారు. ఇక ప్ర‌మోష‌న్ల హ‌డావుడి మొద‌లుపెట్టాల‌నుకున్న టైంలో అత‌డికి యాక్సిడెంట్ అయింది. ఇదేమీ చిన్న ప్ర‌మాదం కాదు. అత‌ను రెండు రోజులు స్పృహ‌లో లేడు. వారం రోజుల‌కు పైగా తేజుకు వెంటిలేట‌ర్ ద్వారా శ్వాస అందించాల్సి వ‌చ్చింది. అత‌డికో స‌ర్జ‌రీ సైతం జ‌రిగింది.

ఈ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని అక్టోబ‌రు 1 నుంచి వాయిదా వేస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. సినిమా విడుద‌ల‌కు ప‌ది రోజ‌లు ముందు హీరో ఆసుప‌త్రిలో ఉంటే ఇక రిలీజ్ ఎలా అనే సందేహాలు క‌లిగాయి.

తేజు ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాడ‌నే విష‌యంలో క్లారిటీ లేదు. అత‌నైతే ప్ర‌మోష‌న్ల‌కు హాజ‌ర‌య్యే ప‌రిస్థితి ఎంత‌మాత్రం క‌నిపించ‌డం లేదు. దీంతో వాయిదా అనివార్యం అనుకున్నారు. కానీ చిత్ర బృందం మాత్రం రిలీజ్ డేట్‌కు క‌ట్టుబ‌డింది. సెన్సార్ కూడా పూర్తి చేయించి.. అక్టోబ‌రు 1నే రిప‌బ్లిక్‌ను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌న ఇచ్చింది. సినిమాకు సెన్సార్ వాళ్లు యు/ఎ స‌ర్టిఫికెట్ జారీ చేశారు. తేజు ప‌వ‌ర్ ఫుల్ లుక్‌లో ఉన్న లుక్‌తో రిలీజ్ డేట్ పోస్ట‌ర్ రిలీజ్ వ‌దిలారు.

ప్ర‌స్థానం ఫేమ్ దేవా క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సామాజిక అంశాలు, రాజ‌కీయాల చుట్టూ తిరిగే క‌థ‌తో రూపొందింది. తేజు స‌ర‌స‌న ఇందులో ఐశ్వ‌ర్యా రాజేష్ న‌టించింది. జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లు పోషించారు. తేజు కొంచెం కోలుకున్నాక, రిలీజ్ ముంగిట వీడియో బైట్స్ ద్వారా త‌న చిత్రాన్ని ప్ర‌మోట్ చేస్తాడేమో చూడాలి.