తమన్నా భలే కవర్ చేసిందే..

సినిమాల్లో నటిస్తా.. కానీ ప్రమోషన్లంటే జాన్తా నై అంటూ ఖరాఖండిగా చెప్పేసి ముందే ఈమేరకు అగ్రిమెంట్ చేసుకునే నయనతార లాంటి హీరోయిన్లుండే ఇండస్ట్రీలోనే.. ప్రమోషన్లను బాధ్యతగా భావించి సినిమా రిలీజ్ టైంలో మీడియా చుట్టూ తిరిగే కథానాయికలూ ఉన్నారు. అలా చాలా బాధ్యతతో వ్యవహరించే కథానాయికల్లో తమన్నా పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఆమె ఏ సినిమా అయినా.. టీవీ షో అయినా చాలా చక్కగా ప్రమోట్ చేస్తుంది.

మంగళవారం ఒకే రోజు ఆమె కొన్ని గంటల వ్యవధిలో రెండు సినిమా ఈవెంట్లలో పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అందులో ఒకటి ‘మాస్ట్రో’ ప్రి రిలీజ్ ఈవెంట్ కాగా.. ఇంకోటి ‘సీటీమార్’ పోస్ట్ రిలీజ్ సక్సెస్ సెలబ్రేషన్ ఈవెంట్. ఇవి రెండూ కూడా మంగళవారం సాయంత్రమే హైదరాబాద్‌లో వేర్వేరు వేదికల్లో జరిగాయి. ‘సీటీమార్’లో తమన్నా హీరోయిన్ కాగా.. ‘మాస్ట్రో’లో హీరోయిన్ని మించిన కీలక పాత్రలో నటించింది.

రెండు సినిమాల ఈవెంట్లకూ తమన్నా రాక చాలా అవసరం. రెండు ఈవెంట్లు అటు ఇటుగా ఒకే సమయంలో జరిగాయి. ‘మాస్ట్రో’ ఈవెంట్ కొంచెం ముందు మొదలైంది. ఆ ఈవెంట్‌కు తమన్నా హాజరు కావడంతో ‘సీటీమార్’ టీంకు హ్యాండిచ్చినట్లే అనుకున్నారు. ‘మాస్ట్రో’ ఈవెంట్‌కు హీరోయిన్ నభా నటేష్ వచ్చిన నేపథ్యంలో తమన్నా దీన్ని స్కిప్ చేసి అయినా ‘సీటీమార్’కు వెళ్లాల్సిందని, ఆమె ఇలా చేసిందేంటని కొందరు సోషల్ మీడియాలో కౌంటర్లు కూడా వేశారు. కానీ ఇక్కడ తన స్పీచ్ ముగించి, కాసేపు గడిపాక తమన్నా ఇక్కడి నుంచి ‘సీటీమార్’ ఈవెంట్ కోసం బయల్దేరింది.

అక్కడ ఈవెంట్ మధ్యలో వేదిక ఎక్కింది. దీంతో రెండు చోట్లా తమన్నా లేని లోటు కనిపించలేదు. మధ్యలో డ్రెస్ చేంజ్ లాంటిదేమీ చేసుకోకుండా ఒకే డ్రెస్‌తో తమన్నా రెండు ఈవెంట్లనూ కవర్ చేసింది. ఆమె సిన్సియారిటీ చూసి టాలీవుడ్ జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తమన్నా 16 ఏళ్లుగా టాలీవుడ్‌లో హవా సాగిస్తోందంటే ఈ కమిట్మెంట్ వల్లే అని ఆమెను పొగుడుతున్నారు.