భవదీయుడు భగత్ సింగ్.. నిన్నట్నుంచి సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్న టైటిల్ ఇది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కనున్న చిత్రానికి ఈ పేరు ఖరారు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. భగత్ సింగ్ అనే పేరు పవన్ పాత్రకు అనగానే అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. పవన్ దేశభక్తి గురించి అందరికీ తెలిసిందే. అలాగే స్వాతంత్ర్య సమర యోధుల పట్ల జనసేనాని చూపించే అభిమానం గురించీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
ఈ నేపథ్యంలో గొప్ప యోధుడిగా గుర్తింపున్న భగత్ సింగ్ పేరును పవన్ పాత్రకు పెడితే.. ఆయన ఇమేజ్ పరంగా చూసినా అది కచ్చితంగా ప్లస్ అవుతుంది. సినిమాల ద్వారా కొంత మేర పొలిటికల్ మైలేజీ కూడా రాబట్టాలని పవన్ చూస్తున్నాడీ మధ్య. ‘వకీల్ సాబ్’లో సామాజిక అంశాల మేళవింపు ఉండటం పవన్‌కు బాగానే కలిసొచ్చింది.
హరీష్ శంకర్ అంటే మామూలుగా ఎంటర్టైనర్లకు పెట్టింది పేరు. పవన్‌తో ఇంతకుముందు హరీష్ తీసిన ‘గబ్బర్ సింగ్’ ఎంతగా వినోదాన్ని పంచిందో తెలిసిందే. ఐతే ఈసారి కేవలం ఎంటర్టైన్మెంటే కాకుండా వేరే అంశాలు కూడా ఉంటాయని ప్రి లుక్ పోస్టర్లోనే సంకేతాలు ఇచ్చాడు హరీష్. ఆ పోస్టర్ చూస్తే రాజకీయాలు, సామాజిక అంశాల ప్రస్తావన ఉండొచ్చని అంచనాలు కలుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ కేవలం రూమర్ కాకపోవచ్చు. నిజంగానే సినిమాకు ఈ టైటిల్ పరిశీలనలో ఉండొచ్చు. జనాల స్పందన తెలుసుకుందామని మీడియాకు ఈ టైటిల్ లీక్ చేశారేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో దసరా సందర్భంగా ప్రారంభించాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించే అవకాశాలున్నాయి. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates