త్రివిక్రమ్ అలా.. క్రిష్ ఇలా

ఒక సినిమాలో దర్శకుడిదే అత్యంత కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. సినిమా హిట్టయినా క్రెడిట్ దక్కేది దర్శకుడికే. అలాగే ఫ్లాపైనా ప్రధానంగా బాధ్యత వహించాల్సింది అతనే. ఐతే ఒక సినిమాకు అత్యంత కీలకమైంది మాత్రం కథే. ఆ కథను తయారు చేసే రచయితలకు సరైన గుర్తింపు ఇవ్వరనే అభిప్రాయం టాలీవుడ్లో బలంగా ఉంది. స్క్రిప్టులో అత్యంత కీలకంగా వ్యవహరించే వ్యక్తుల పేర్లు కొన్నిసార్లు పోస్టర్ల మీద కూడా కనిపించవు. టైటిల్ కార్డ్స్‌లో వారి పేర్లను ప్రస్తావించడానికి కూడా కొన్నిసార్లు దర్శకులు ఇష్టపడరు. ఇలాంటి ఉదంతాలు బోలెడు కనిపిస్తాయి.

ఐతే ఘోస్ట్ రైటర్ల సాయం తీసుకుని వాళ్లకు డబ్బులతో సరిపెట్టి రైటింగ్ క్రెడిట్ అంతా తీసుకోవడం మామూలే కానీ.. కొన్నిసార్లు కథకు స్ఫూర్తి ఏంటో అందరికీ తెలిసిన విషయమే అయినా కూడా క్రెడిట్ ఇవ్వడానికి దర్శకులు ఇష్టపడరు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన త్రివిక్రమ్ కూడా ఓ సందర్భంలో ఇలా చేశాడు.

త్రివిక్రమ్ తీసిన ‘అఆ’ సినిమాకు ‘మీనా’ అనే నవల ఆధారం అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ నవల ఆధారంగా ‘మీనా’ అనే సినిమా కూడా వచ్చింది. ఒకసారి ఆ సినిమా చూస్తే ‘అఆ’కు చాలా దగ్గరగా ఉండటం గమనించవచ్చు. ఐతే సినిమా మేకింగ్ దశలో ఉండగానే ‘అఆ’కు స్ఫూర్తి ‘మీనా’ అన్న విషయం బయటపడ్డా కూడా ఆ సినిమా టైటిల్ కార్డ్స్‌లో ఒరిజినల్ రైటర్ యద్దనపూడి సులోచనారాణికి క్రెడిట్ ఇవ్వలేదు త్రివిక్రమ్. రచన-దర్శకత్వం అంటూ పూర్తిగా తనే క్రెడిట్ తీసుకున్నాడు. దీనిపై తీవ్ర విమర్శలు రాగా.. సినిమా రిలీజయ్యాక ప్రెస్ మీట్ లో టెక్నికల్ రీజన్స్ వల్ల యద్దనపూడి పేరు టైటిల్ కార్డ్స్‌లో పడలేదంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు త్రివిక్రమ్.

ఐతే త్రివిక్రమ్ అప్పుడలా చేస్తే.. ఇప్పుడు మరో స్టార్ క్రిష్ మాత్రం తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తన కొత్త చిత్రం ‘కొండపొలం’ ఏ నవల ఆధారంగా తెరకెక్కిందో దాని రచయిత పేరును పోస్టర్ మీద వేశాడు. సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి అనే రాయలసీమ రచయిత రాసిన ‘కొండపొలం’ అనే నవలే ఈ చిత్రానికి ఆధారం. సినిమాకు కూడా నవల పేరు పెట్టడమే కాదు.. ‘A Sannapurddy venkatramireddy novel’ అంటూ ఘనంగా ఆయన పేరును పోస్టర్ మీద వేశారు. ఈ విషయంలో క్రిష్‌కు సెల్యూట్ చేయాల్సిందే. ఇలా మిగతా దర్శకులందరూ కూడా రచయితలకు రావాల్సిన క్రెడిట్‌ను ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో సందేహం లేదు.