ఆర్ఆర్ఆర్ వాయిదా?

RRR Rajamouli


ఇప్పుడు దేశ‌మంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా అంటే.. ఆర్ఆర్ఆర్‌యే. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి రూపొందిస్తున్న ఈ చిత్రంపై అంచ‌నాలు మామూలుగా లేవు. ఈ చిత్రానికి ఇప్ప‌టికే రెండుసార్లు రిలీజ్ డేట్ ఇచ్చి వాయిదా వేయ‌డం తెలిసిందే. చివ‌ర‌గా ఖ‌రారైన రిలీజ్ డేట్ అక్టోబ‌రు 13. కానీ ఆ డేట్ ఇచ్చాక క‌రోనా సెకండ్ వేవ్ వ‌చ్చి ప‌డింది. షూటింగ్ ఆల‌స్య‌మైంది. దీంతో మ‌రోసారి వాయిదా అనివార్యం అనుకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ టీం మాత్రం అదే డేట్‌కు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లుగా క‌నిపించింది.

ఈ మ‌ధ్య రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలోనూ అక్టోబ‌రు 13నే ఈ చిత్రం విడుద‌ల కానున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. దీంతో అభిమానులు ఆ డేట్ విష‌యంలో ఆశావ‌హ దృక్ప‌థంతోనే ఉన్నారు. కానీ తాజా స‌మాచారం ప్రకారం ఈ చిత్రం అక్టోబ‌రులోనే కాదు.. ఈ ఏడాది విడుద‌ల‌య్యే అవ‌కాశ‌మే లేద‌ట‌. ముందు ద‌స‌రాకు అయితే సినిమా రాద‌న్న‌ది స్ప‌ష్టం.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ కావాల్సిన తేదీకి ఇప్ప‌ట్నుంచి ఇంకో రెండు నెల‌లు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌గా.. ఇంకా ఇండియాలో చాలా చోట్ల థియేట‌ర్లు మూత‌ప‌డి ఉన్నాయి. ఉత్త‌రాదిన థియేట‌ర్ల ప‌రిస్థితి ఏమాత్రం ఆశాజ‌న‌కంగా లేదు. వ‌చ్చే రెండు నెల‌ల్లో అంత వేగంగా ప‌రిస్థితులు మారిపోతాయ‌న్న ఆశ లేదు. మ‌రోవైపు ఆర్ఆర్ఆర్ టీం ఇంకా చివ‌రి పాట చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉంది. త‌ర్వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌ని మిగిలుంది. అక్టోబ‌రు 13కు రిలీజ్ అంటే హ‌డావుడి త‌ప్ప‌దు.

థియేట‌ర్ల ప‌రిస్థితి ఆశాజ‌న‌కంగా ఉంటే రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి అయినా సినిమాను సిద్ధం చేయొచ్చు. కానీ అక్క‌డ ప‌రిస్థితులు బాగా లేవు. అందుకే సినిమాను వాయిదా వేయ‌డం త‌ప్ప మ‌రో ప్ర‌త్యామ్నాయం క‌నిపించ‌డం లేదు. సంక్రాంతికి ఆల్రెడీ ర‌ష్ ఎక్కువైపోయింది కాబ‌ట్టి.. వ‌చ్చే వేస‌వి ఆరంభానికి ఆర్ఆర్ఆర్ షెడ్యూల్ కావ‌చ్చ‌ని అంటున్నారు. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.