ఒక్క మహేష్.. ఎన్ని చేయగలడు?

టాలీవుడ్లో ప్రతి దర్శకుడూ ఒక్కసారైనా పని చేయాలని ఆశించే హీరోల్లో మహేష్ బాబు ఒకడు. హాలీవుడ్ హీరోలకు దీటైన కటౌట్‌, తనదైన స్క్రీన్ ప్రెజెన్స్.. తనదైన నటనతో తన చిత్రాలకు తీసుకొచ్చే ఆకర్షణే వేరు. అన్నింటికీ మించి అతను ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు. అందుకే మహేష్‌తో పని చేయాలని ప్రతి దర్శకుడూ కోరుకుంటాడు.

అతడితో పని చేయని వాళ్లకే కాదు.. పని చేసిన వాళ్లకూ మళ్లీ మహేష్‌తో సినిమా తీయాలని ఉంటుంది. అలా మహేష్ కోసం ఎదురు చూస్తున్న దర్శకుల సంఖ్య చాలా పెద్దదే. నిన్న మహేష్ బర్త్‌డే సందర్భంగా పెట్టిన ట్విట్టర్ స్పేస్‌లో చాలామంది దర్శకులు పాల్గొన్నారు.

అందులో ప్రతి ఒక్కరూ మహేష్‌తో సినిమా తీసే విషయమే చర్చించారు. చాలామంది మహేష్‌తో సినిమా పక్కా అన్నట్లే మాట్లాడారు. అందరూ ఆశావహ దృక్పథంతోనే కనిపించారు కానీ.. ఒక్క మహేష్ ఎన్ని సినిమాలు చేయగలడు అనే ప్రశ్న తలెత్తింది.

‘మహర్షి’ తర్వాత మహేష్‌తో మరో సినిమా చేయడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాక ఏదో కారణంతో వంశీ పైడిపల్లి సినిమా ఆగిపోవడం, ‘సర్కారు వారి పాట’ మొదలు కావడం తెలిసిందే. ఐతే మహేష్‌తో తాను మరో చిత్రం చేయడం పక్కా అని.. ఈసారి చేసే సినిమా మరో స్థాయిలో ఉంటుందని వంశీ పైడిపల్లి వెల్లడించాడు స్పేస్‌లో. ఇక అనిల్ రావిపూడి సైతం మహేష్‌తో తాను మరో చిత్రం చేయనున్నట్లు తెలిపాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు కొన్ని పరిమితుల మధ్య పని చేశానని.. ఈసారి మహేష్‌తో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ తీస్తానని అన్నాడు.

మరోవైపేమో బాబీ సైతం మహేష్‌తో సినిమా చేయడం గురించి మాట్లాడాడు. ‘మోసగాళ్లకు మోసగాడు’ రీమేక్ చేయాలనుందని.. మహేష్ కోసం స్క్రిప్టు రాస్తానని అన్నాడు. గోపీచంద్ మలినేని సైతం మహేష్‌తో ఒక మాస్ ఎంటర్టైనర్ తీస్తానని.. మంచి స్క్రిప్టు రెడీ చేసే ప్రయత్నం చేస్తానని అన్నాడు. ఇక ఎప్పట్నుంచో మహేష్‌ కోసం ట్రై చేస్తున్న సందీప్ రెడ్డి వంగ సైతం మహేష్‌తో తన కాంబినేషన్లో సినిమా పక్కా అన్నాడు. మహేష్‌కు కథ కూడా చెప్పినట్లు వెల్లడించాడు. మహేష్ ఏమో.. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడు. ఆపై రాజమౌళి సినిమా రెడీగా ఉంటుంది. వీటితోనే ఇంకో రెండేళ్లకు పైగా ఖాళీ లేదంటే.. మహేష్‌తో సినిమా కోసం ఇంతమంది లైన్లో ఉన్నారు.