ట్రైల‌ర్ టాక్: హైజాక్‌లో హీరోయిజం

ఓవైపు మ‌హారాష్ట్రలో థియేట‌ర్లు చాలా వ‌ర‌కు మూత‌ప‌డి ఉండ‌గా.. అలాగే ఉత్త‌రాదిన కూడా ప‌లు రాష్ట్రాల్లో థియేట‌ర్ల‌పై ఆంక్ష‌లు కొన‌సాగుతుండ‌గా.. ఓ బాలీవుడ్ భారీ చిత్రానికి విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది చిత్ర బృందం. అంతే కాదు.. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ కూడా లాంచ్ చేసేసింది. ఆ చిత్ర‌మే.. బెల్‌బాట‌మ్.

అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో కొత్త ద‌ర్శ‌కుడు రంజిత్ తివారి రూపొందించిన సినిమా ఇది. ఇప్ప‌టిదాకా ఫ‌స్ట్ లుక్ మాత్ర‌మే లాంచ్ చేసి ఈ సినిమా క‌థేంటో విప్ప‌కుండా దాచి పెట్టింది చిత్ర బృందం. అస‌లు బెల్‌బాట‌మ్ అనే టైటిల్ ఈ సినిమాకు ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు. కానీ ట్రైల‌ర్‌తో విష‌యం వెల్ల‌డైపోయింది. ఇందులో హీరో ఒక సీక్రెట్ ఏజెంట్. అత‌డి కోడ్ నేమ్.. బెల్‌బాట‌మ్. ప్ర‌భుత్వం కోసం సీక్రెట్ ఆప‌రేష‌న్లు చేసే అన్ సంగ్ హీరోగా అక్ష‌య్ క‌నిపించ‌నున్నాడీ చిత్రంలో.

1984లో జ‌రిగిన ఓ ఫ్లైట్ హైజాక్ నేప‌థ్యంలో ఈ సినిమా న‌డుస్తుంది. భార‌త్‌కు చెందిన 200 మంది ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న విమానాన్ని పాకిస్థాన్ స‌హ‌కారంతో ఉగ్ర‌వాదులు హైజాక్ చేస్తారు. అప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ప్ర‌ధాని అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హిస్తుంది.

ఈ క్ర‌మంలో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేది ఒకే ఒక్క‌డంటూ హీరో మీదికి ఫోక‌స్ షిఫ్ట్ అవుతుంది. ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో బెల్‌బాట‌మ్ అని పిలుచుకునే అక్ష‌య్ కుమార్ రంగంలోకి దిగి ఒక టీంను ఏర్పాటుచేసుకుని.. త‌న మిష‌న్‌ను ఎలా అమ‌ల్లో పెట్టాడు.. హైజాక‌ర్ల ఆట క‌ట్టించి ఎలా బందీల‌ను విడిపించాడు అన్న‌ది ఈ సినిమా స్టోరీ.

అక్ష‌య్ న‌టించిన బేబీ, ఎయిర్ లిఫ్ట్ సినిమాల‌ను గుర్తు చేసేలా సాగింది ట్రైల‌ర్. సినిమా అంత కొత్త‌గానూ ఉండేలా లేదు. అలాగ‌ని అనాస‌క్తిక‌రంగానూ అనిపించ‌ట్లేదు. ఐతే రిలీజ్ డేట్ ఇచ్చేసి విడుద‌ల‌కు స‌న్నాహాలైతే చేస్తున్నారు కానీ.. ఇంకో రెండు వారాల త‌ర్వాత ప‌రిస్థితులు ఎలా ఉంటాయి.. థియేట‌ర్ల సంగ‌తేంటి అన్న‌దే చూడాలి.