నెల రోజుల కిందట్నుంచి తెలుగు సినీ పరిశ్రమలో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికల గురించి ఎంత రగడ నడుస్తోందో తెలిసిందే. సెప్టెంబరులో ఎన్నికలు రాబోతున్నాయన్న సంకేతాల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ పడబోతున్నట్లు వెల్లడించడం.. తన ప్యానెల్‌ను కూడా ప్రకటిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
తర్వాత మంచు విష్ణు సైతం రేసులోకి రావడం, ‘మా’ భవన నిర్మాణం ఖర్చు మొత్తం తానే భరిస్తాననడంతో పాటు కొన్ని సంచలన స్టేట్మెంట్లు ఇవ్వడమూ విదితమే. దీనికి తోడు ప్రకాష్ రాజ్, నాగబాబు లాంటి వాళ్లు గత కార్యవర్గాలపై విమర్శలు చేయడం, నరేష్ అండ్ టీం దీటుగా బదులివ్వడంతో వ్యవహారం వేడెక్కిపోయింది. ఇదిలా ఉంటే అసలు ఎన్నికలెప్పుడో తెలియని సందిగ్ధత నెలకొని అందరూ ఆ విషయంలో స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో కీలకమైన ‘మా’ ఈసీ మీటింగ్ గురువారం వర్చువల్‌గా జరిగింది. ‘మా’ వ్యవస్థాపక అధ్యక్షుల్లో ఒకరైన కృష్ణంరాజు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో మురళీమోహన్, మోహన్‌బాబు, ‘మా’ అధ్యక్షుడు నరేశ్, కార్యదర్శి జీవితలతోపాటు ఇతర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణం రాజు, చిరంజీవి, మోహన్ బాబు, మురళీ మోహన్ ఉన్న క్రమశిక్షణా సంఘంలోకి కొత్తగా సీనియర్ నటులు గిరిబాబు, శివకృష్ణలను చేర్చుకున్నారు. దీంతో క్రమశిక్షణా సంఘం సభ్యుల సంఖ్య ఆరుకు చేరుకుంది.
ఆగస్ట్ మూడోవారంలో సర్వసభ్య సమావేశం పెట్టాలని సంఘం నిర్ణయించింది. ఇక ‘మా’ ఎన్నికల విషయానికి వస్తే.. సెప్టెంబరులో జరిగే సూచనలే ఈ సమావేశం సందర్భంగా కనిపించాయి. సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని మెజారిటీ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై తుది నిర్ణయాన్ని క్రమశిక్షణా సంఘం తీసుకుంటుందని నిర్ణయించారు. అతి త్వరలో క్రమశిక్షణా సంఘం సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలు ఎప్పుడనేది ఏజీఎంలో ప్రకటిస్తారని సమాచారం. ‘మా’ వర్గాల సమాచారం ప్రకారం సెప్టెంబరు 12న ఎన్నికలు జరగొచ్చని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates