పవన్ సినిమా.. రీషూట్ ప్లాన్!

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా కొంత భాగం షూటింగ్ జరిగింది. అయితే ఇప్పుడు సడెన్ గా ఈ సినిమా ను కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ల తప్పుకున్నారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి సైడ్ అయిపోయారని సమాచారం.

ఆయన స్థానంలో రవి కె చంద్రన్ ను తీసుకొచ్చారు. అయితే సినిమాలో ఇప్పటివరకు ప్రసాద్ మూరెళ్ల చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను పక్కన పెట్టాలని చూస్తున్నారట. మరోసారి ఆ సన్నివేశాలను రీషూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. ప్రసాద్ మూరెళ్లకు, దర్శకుడికి మధ్య పొసగలేదని.. కొన్ని సన్నివేశాలను చూసిన పవన్ కూడా కథ టెంపో మారిపోయినట్లుగా ఉందని చెప్పినట్లు సమాచారం.

ఇప్పుడు ప్రసాద్ మూరెళ్ల చిత్రీకరించిన సన్నివేశాలను వాడుకుంటే కెమెరామెన్ గా ఆయనకు కూడా క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఆయన తీసిన సన్నివేశాలను రీషూట్ చేయాలని భావిస్తున్నారు. ఈ లెక్కన చూస్తే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఏదేమైనా.. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి క్రిష్ సినిమా సెట్స్ పైకి వెళ్లాలనుకుంటున్నారు పవన్. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘ఏకే’ రీమేక్ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.