క్రిటిక్ కమ్ సోషల్ యాక్టివిస్ట్ కత్తి మహేష్ మరణం ఇప్పుడు ఆయన సన్నిహితులను, అభిమానులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. రెండు వారాల కిందట యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డ ఆయన.. మధ్యలో కోలుకుంటున్నట్లుగా వార్తలొచ్చాయి కానీ.. ఉన్నట్లుండి పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలాడు. ఊపిరి తిత్తుల్లో నీరు చేరడంతో ఆయన ప్రాణం పోయినట్లు చెబుతున్నారు.
కత్తి మరణ వార్త బయటికి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆయన పేరు మార్మోగిపోతోంది. ఒక పెద్ద సెలబ్రెటీ స్థాయిలో ఆయన గురించి చర్చ జరుగుతోంది. కత్తిని అభిమానించే వాళ్లను మించి వ్యతిరేకించే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. కత్తి అంటే నచ్చని వాళ్లు చాలామంది ఉన్నారు కానీ.. ఆయన ఒక విస్మరించలేని వ్యక్తి అన్నది మాత్రం స్పష్టం.
కత్తిని ఎక్కువగా టార్గెట్ చేసింది రెండు వర్గాల వాళ్లు. అందులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్న సంగతి అందరికీ తెలుసు. అలాగే హిందుత్వ వాదులకు కూడా ఆయనంటే అస్సలు నచ్చదు.
పవన్ కళ్యాణ్ అభిమానులతో మహేష్ కయ్యం గురించి కొత్తగా చెప్పేదేమి లేదు. ఈ విషయంలో తటస్థులు కత్తిని మరీ ఎక్కువగా ఏమీ తప్పుబట్టరు. లక్షల మంది పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆ స్థాయిలో టార్గెట్ చేసినపుడు కత్తి అలా స్పందించడంలో తప్పేముందని వారంటారు.
పవన్, ఆయన అభిమానుల విషయంలో కత్తి హద్దులు దాటినప్పటికీ.. ఆయన అలా ప్రవర్తించడానికి సహేతుకమైన కారణాలే ఉన్నాయంటూ సమర్థిస్తారు. ఐతే రాముడి విషయంలో కత్తి చేసిన కామెంటే ఆయనకు భారీ స్థాయిలో వ్యతిరేకుల్ని తెచ్చి పెట్టింది. కత్తి నాస్తికుడే కావచ్చు. కానీ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఎవరి మత విశ్వాసాలనూ కించపరిచే హక్కు ఆయనకు లేదు.
రాముడు అంత:పురంలో చాలా మంది మహిళలతో సుఖించేవాడని.. సీతకు జింక మాంసం అంటే ఇష్టమని.. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. ఈ కామెంటే కత్తిని లక్షల మంది ద్వేషించేలా చేసింది. ఇలాంటి కామెంట్లు అల్లా గురించో, ఏసు ప్రభువు గురించో కత్తి చేయగలడా అన్నది హిందుత్వ వాదుల ప్రశ్న.
కత్తికి యాక్సిడెంట్ జరిగినపుడు.. ఇప్పుడు మరణానంతరం హిందుత్వ వాదులు స్పందిస్తున్న తీరు ఆయన వారిని మనోభావాలను ఎంతగా కించపరిచారో తెలియజేస్తోంది. కత్తిని ఇష్టపడేవాళ్లు, ఆయన మద్దతుదారులు కూడా నివాళిగా రాస్తున్న పోస్టుల్లో రాముడి గురించి ఈ కామెంట్ చేయాల్సింది కాదనే అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
