పవన్ సినిమాకు ముందు ఇంకోటి


‘సైరా నరసింహారెడ్డి’ లాంటి భారీ చిత్రాన్ని డైరెక్ట్ చేశాక స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన రేంజ్ బాగా తగ్గించుకోవాల్సి వచ్చింది. స్టార్ హీరోలెవరూ అందుబాటులో లేకపోవడం, సీనియర్ హీరో అక్కినేని నాగార్జున నుంచి ఆబ్లిగేషన్ రావడంతో ఆయన చిన్న కొడుకు అఖిల్‌తో సినిమా చేయాల్సి వచ్చింది. వీళ్ల కలయికలో ‘ఏజెంట్’ పేరుతో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే దీని చిత్రీకరణ మొదలు కాబోతోంది. ఈ సినిమా పూర్తయ్యాక సురేందర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే.

ఐతే పవర్ స్టార్ దీని కంటే ముందు పూర్తి చేయాల్సిన సినిమాలు మూడు ఉన్నాయి. అఖిల్ సినిమా పూర్తి చేశాక కూడా సురేందర్ చాన్నాళ్లే ఖాళీగా ఉండక తప్పదు. ఈ ఖాళీలో మరో సినిమా చేయడానికి సురేందర్ రెడీ అవుతున్నట్లు సమాచారం. అందులో ఓ మెగా హీరోనే లీడ్ రోల్ చేస్తాడట.

‘ఉప్పెన’తో బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చిన పంజా వైష్ణవ్ తేజ్‌తో సురేందర్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తన మేనల్లుళ్ల కెరీర్ విషయంలో పవన్ ఎంత శ్రద్ధ వహిస్తాడో తెలిసిందే. మధ్యలో గాడి తప్పిన తేజు కెరీర్‌ మళ్లీ గాడిన పడటంలో పవన్ పాత్ర కీలకమని అంటారు. వైష్ణవ్ సినిమాల విషయంలోనూ ఆయన పాత్ర ఉంటున్నట్లు ఇండస్ట్రీలో చెబుతుంటారు. పవన్‌తో సినిమాకు ముందు వైష్ణవ్‌తో సినిమా చేస్తే సురేందర్‌కు అది కలిసొస్తుందనడంలో సందేహం లేదు.

మిగతా యువ కథానాయకులకు భిన్నంగా తొలి సినిమాలో ప్రయోగాత్మక పాత్రతో అందరి మనసులూ గెలిచాడు వైష్ణవ్. ఆ తర్వాత కూడా క్రిష్ దర్శకత్వంలో ఓ వైవిధ్యమైన సినిమా చేశాడు. ప్రస్తుతం ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ దర్శకుడు గిరీశయ్యతో ఓ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత నాగార్జున నిర్మాణంలో ఓ సినిమా ఉంటుందంటున్నారు. వీటితో పాటు సురేందర్ సినిమాలోనూ అతను నటించనున్నట్లు చెబుతున్నారు.