సురేష్ బాబు.. క‌క్క‌లేక మింగ‌లేక‌

టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్ బాబు ఇప్పుడు తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయ‌న ప‌రిస్థితి క‌క్క‌లేక మింగ‌లేక అన్న‌ట్లు త‌యారైంద‌ని ఇండ‌స్ట్రీలో చ‌ర్చ న‌డుస్తోంది. క‌రోనా సెకండ్ వేవ్ దెబ్బ‌కు మ‌రోసారి థియేట‌ర్లు మూత‌ప‌డటం, అవి ఎప్పుడు తెరుచుకుని మునుప‌టిలా న‌డుస్తాయో తెలియ‌ని ప‌రిస్థితుల్లో త‌న నిర్మాణంలో తెర‌కెక్కిన నార‌ప్ప‌, దృశ్యం-2, విరాట ప‌ర్వం చిత్రాల‌ను గ‌త నెల‌లోనే ఆయ‌న ఓటీటీల‌కు బేరం పెట్టేశారు. ఇందులో నార‌ప్ప‌, దృశ్యం-2 చిత్రాల‌కు ఇప్ప‌టికే ఓటీటీ డీల్స్ పూర్త‌యిపోగా.. విరాట‌ప‌ర్వం విష‌యంలో చ‌ర్చ‌లు తుది ద‌శ‌లో ఉన్న‌ట్లుగా వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఐతే డీల్స్ పూర్త‌యినా దీని గురించి అధికారిక ప్ర‌క‌ట‌న లేదు. ఆ చిత్రాల డిజిట‌ల్ రిలీజ్ డేట్లు ఇవ్వ‌ట్లేదు. ఇంత‌లోనే లాక్ డౌన్ ఎత్తేశారు. థియేట‌ర్లు పునఃప్రారంభం అయ్యే సూచ‌న‌లు కనిపిస్తున్నాయి.

థియేట‌ర్లు తెరుచుకుని కొత్త సినిమాలు న‌డుస్తున్న స‌మ‌యంలో నార‌ప్ప‌, దృశ్యం-2 లాంటి పెద్ద స్థాయి సినిమాలు ఓటీటీల్లో రిలీజ‌వ‌డం ఎంత‌మాత్రం బాగుండ‌దు. అలాంట‌పుడు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా వాటిని డిజిట‌ల్లో రిలీజ్ చేసేయాలి. కానీ ప్ర‌స్తుతం టాలీవుడ్ ఎగ్జిబిట‌ర్లంద‌రూ సురేష్ బాబు మీద తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. థియేట‌ర్ ఇండ‌స్ట్రీ నాశ‌నం అయిపోతుంటే.. పెద్ద నిర్మాత అయి ఉండి, చేతిలో థియేట‌ర్లు కూడా ఉన్న సురేష్ బాబు ఓటీటీ బాట ప‌ట్ట‌డం ఏంటి అని వారు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

ఓటీటీల వైపు వెళ్లే నిర్మాత‌లంద‌రినీ త‌ప్పుబ‌డుతున్నారు. దీనిపై ఉద్య‌మానికి కూడా సిద్ధ‌మ‌వుతున్నారు. నిర్మాత‌లు మార‌కుంటే థియేట‌ర్ల‌ను పూర్తిగా మూసేస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో సురేష్ బాబుకు ఏం చేయాలో పాలుపోవ‌ట్లేదు. త‌న సినిమాల‌ను ఓటీటీలో రిలీజ్ చేయ‌లేడు. అలాగ‌ని ఆగ‌లేడు. పోనీ ఓటీటీ డీల్ చేయాల‌న్నా కూడా ఇబ్బందే. మొత్తంగా ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు సురేష్ బాబు.