ప్రభాస్‌కు ఒక్క ఫోన్ చేస్తే చాలు


‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ఇమేజ్ ఎలా మారిపోయిందో తెలిసిందే. ఈ చిత్రానికి ముందు 50 కోట్ల లోపు మార్కెట్ ఉన్న ప్రభాస్.. ఒకేసారి అలవోకగా 500 కోట్ల బిజినెస్ చేసే స్థాయికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతడి చిత్రాల మీద 500 కోట్ల బడ్జెట్ పెట్టేస్తున్నారంటే తన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ‘బాహుబలి’ తర్వాత తిరుగులేని స్థాయిని అందుకున్న ప్రభాస్‌ను మొదటగా డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నది యువ దర్శకుడు సుజీత్.

‘రన్ రాజా రన్’ లాంటి చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అతను.. ప్రభాస్‌తో ‘సాహో’ లాంటి భారీ చిత్రాన్ని తీసే అవకాశం దక్కించుకున్నాడు. ఐతే ఆ చిత్రానికి తన శక్తికి మించి కష్టపడ్డాడు కానీ.. ఫలితం దక్కలేదు. ‘సాహో’ పెద్ద డిజాస్టర్ అయింది. ఈ ప్రభావం సుజీత్ కెరీర్ మీద బాగానే పడింది. ‘సాహో’ విడుదలై రెండేళ్లవుతున్నా ఇప్పటికీ తన తర్వాతి చిత్రాన్ని మొదలుపెట్టలేదు. హిందీలో ఓ చిత్రం కమిటయ్యాడు కానీ.. అది పట్టాలెక్కడంలో ఆలస్యం జరుగుతోంది.

ఐతే ‘సాహో’ ఫలితం ఎలా ఉన్నప్పటికీ ప్రభాస్‌తో తన రిలేషన్ ఏమాత్రం దెబ్బ తినలేదని అంటున్నాడు సుజీత్. ప్రభాస్‌కు తన మీద నమ్మకం కూడా సడలలేదని అతను చెప్పాడు. తరుణ్ భాస్కర్ నిర్వహించే టాక్ షో సందర్భంగా అతనీ వ్యాఖ్యలు చేశాడు. చాలామందికి ప్రభాస్‌ దగ్గరికి వెళ్లి కథ చెప్పడం చాలా కష్టమైన విషయం అని.. కానీ తనకు మాత్రం ప్రభాస్ ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటాడని సుజీత్ తెలిపాడు. తాను ఎప్పుడు కాల్ చేసినా ప్రభాస్ స్పందిస్తాడని.. ఇప్పుడు కూడా తాను ఓ కథ చెబితే ప్రభాస్ నో అనడని.. తనపై ప్రభాస్‌కు ఉన్న నమ్మకం అలాంటిదని వ్యాఖ్యానించాడు సుజీత్.

‘సాహో’ తర్వాత సుజీత్ ‘లూసిఫర్’ రీమేక్‌ను డైరెక్ట్ చేయాల్సింది. కానీ అది సాధ్యపడలేదు. ఆ తర్వాత ‘ఛత్రపతి’ హిందీ రీమే‌క్‌ను అతనే తీస్తాడని ప్రచారం సాగింది. అది నిజం కాలేదు. చివరికి జీ స్టూడియోస్ వాళ్లతో ఓ బాలీవుడ్ మూవీ తీయడానికి సుజీత్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రస్తుతం దాని మీదే అతను పని చేస్తున్నాడు.