ఆర్ఆర్ఆర్‌లో సెన్సేష‌న‌ల్ సాంగ్

RRR


త‌న సినిమాల్లో యాక్ష‌న్ ఘ‌ట్టాల‌నే కాదు.. పాట‌ల‌ను కూడా ఉద్వేగ‌భ‌రితంగా, ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా తీస్తుంటాడు రాజ‌మౌళి. చివ‌ర‌గా రాజ‌మౌళి తీసిన‌ బాహుబ‌లిః కంక్లూజ‌న్ సినిమాలో టైటిల్ సాంగ్.. అలాగే హంస‌నావ.. దండాల‌య్యా పాట‌లు ప్రేక్ష‌కుల‌కు ఎంత గొప్ప‌ అనుభూతినిచ్చాయో తెలిసిందే. ఇప్పుడు జ‌క్క‌న్న నుంచి వ‌స్తున్న ఆర్ఆర్ఆర్‌లోనూ అద్భుత‌మైన పాట‌లుంటాయని సమాచారం.

అందులోనూ హీరోలు జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్‌ల మీద జ‌క్కన్న ఒక ఎపిక్ సాంగ్ తీస్తున్నాడ‌ట‌. అది టాలీవుడ్లో ప్ర‌త్యేకంగా నిలిచిపోయే పాట అవుతుంద‌ని చిత్ర వ‌ర్గాలు అంటున్నాయి. ఏకంగా 8 నిమిషాల నిడివితో సుదీర్ఘంగా, ఉద్వేగ‌భ‌రితంగా ఆ పాట సాగుతుంద‌ట‌. ఈ పాట‌కు అద్భుత‌మైన లిరిక్స్, ట్యూన్ రెడీ అయ్యాయ‌ని.. దీని చిత్రీక‌ర‌ణ కూడా ప్ర‌త్యేకంగా ఉంటుంద‌ని స‌మాచారం.

ఈ పాటను దాదాపు 20 రోజుల పాటు చిత్రీక‌రించ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని.. కొత్త షెడ్యూల్లో ఈ పాట‌ను షూట్ చేయ‌బోతున్నార‌ని తెలిసింది. ఇప్పుడు ఈ పాట‌కు సంబంధించిన విశేషాలు టాలీవుడ్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. లాక్ డౌన్ కార‌ణంగా రెండు నెల‌ల కింద‌టే ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆపేశారు. జులైలో కొత్త షెడ్యూల్ మొద‌లుపెట్ట‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. చిత్ర ప్ర‌ధాన తారాగ‌ణ‌మంతా షూటింగ్‌లో పాల్గొన‌బోతోంది. వీలైనంత త్వ‌ర‌గా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి.. ఆ త‌ర్వాత దాదాపు ఆరు నెల‌లు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌పై కూర్చోబోతున్నారు.

ఈ చిత్రాన్ని బ‌హు భాష‌ల్లో రిలీజ్ చేయాల్సి ఉండ‌టం, వీఎఫ్ఎక్స్ ప‌నులు కూడా చాలా ఉండ‌టంతో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌కు చాలా స‌మ‌యం వెచ్చించాల్సి ఉంది. వీలును బ‌ట్టి వ‌చ్చే సంక్రాంతికి లేదంటే వేస‌వికి ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తేవాల‌ని భావిస్తున్నారు.