సినీ రంగంలో పట్టువిడుపులు లేకుంటే చాలా కష్టం. మరీ పట్టుదలకు పోతే కెరీర్లే దెబ్బ తినేస్తుంటాయి. తమిళ లెజెండరీ కమెడియన్ వడివేలు ఉదంతం ఇందుకు ఉదాహరణ. ఒకప్పుడు కోలీవుడ్లో ఆయన టాప్ కమెడియన్. చేతి నిండా సినిమాలతో హీరోలను మించి సంపాదిస్తూ ఉండేవాడాయన. ఐతే కాస్త అవకాశాలు తగ్గుతున్న సమయంలో రాజకీయాల్లోకి అడుగు పెట్టి కొంత మేర కెరీర్‌ను దెబ్బ తీసుకున్న వడివేలు.. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో కయ్యం పెట్టుకుని పూర్తిగా తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు.
గతంలో శంకర్ నిర్మాణంలో ఆయన శిష్యుడు చింబుదేవన్.. వడివేలును హీరోగా పెట్టి హింసై అరసన్ 23వ పులకేసి అనే సినిమా తీశాడు. ఆ చిత్రం తమిళంలో పెద్ద విజయం సాధించింది. తెలుగులోనూ అనువాదమై ఇక్కడి ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి కొన్నేళ్ల కిందట సీక్వెల్ తీయాలనుకున్నారు.
శంకర్ నిర్మాణంలోనే వడివేలునే పెట్టి చింబుదేవన్ ఈ సినిమాను మొదలుపెట్టాడు. కొంత షూటింగ్ జరిగాక సినమాను మధ్యలో ఆపేశారు. స్క్రిప్టులో మార్పు చేసినందుకో.. మరో కారణంతోనో వడివేలు ఈ సినిమాను వదిలేశాడు. ఆయనకు, శంకర్‌కు మధ్య అప్పట్లో పెద్ద గొడవే నడిచింది. వడివేలు ఇలా సినిమాను మధ్యలో వదిలేయడంతో శంకర్ కోర్టుకెక్కాడు కూడా. ఆ కేసు ఎంతకూ తేలక.. సినిమా ముందుకు కదలక.. ఏళ్లు గడిచిపోయాయి. ఈ వివాదం వల్ల వడివేలు తర్వాత సినిమాలకు దూరం అయిపోయాడు.
ఐతే ఎట్టకేలకు ఇప్పుడు శంకర్, వడివేలు మధ్య వివాదం పరిష్కారం అయిందట. ఐసరి గణేష్ అనే నిర్మాత వీళ్లిద్దరితో మాట్లాడి గొడవను పరిష్కరించాడు. సినిమాను మధ్యలో ఆపేయడం వల్ల తలెత్తిన రూ.2 కోట్ల నష్టాన్ని శంకర్‌కు వడివేలు చెల్లించి ఈ సినిమా షూటింగ్‌కు హాజరు కానున్నాడట. వచ్చే ఏడాది హింసై అరసన్ 24వ పులకేసి విడుదలవుతుందని ఆశిస్తున్నారు.