ఈ అమ్మాయికి ఇప్పుడైనా హిట్టొస్తుందా?

కొంచెం బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలకు కెరీర్ ఆరంభంలో ఒడుదొడుకులు ఎదురైనా పర్వాలేదు కానీ.. హీరోయిన్లకు మాత్రం మొదట్లో ఎదురు దెబ్బలు తగిలితే అంతే సంగతులు. ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా సరే ఐరెన్ లెగ్ ముద్ర వేసేస్తారు. అందులోనూ ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోయిన్లకు మాత్రం ఆరంభంలో మంచి హిట్లు పడాల్సిందే. లేదంటే కెరీర్‌కు బ్రేకులు పడిపోతాయి.

కానీ మేఘా ఆకాష్ మాత్రం ఇందుకు మినహాయింపు. ఆమె ఇప్పటిదాకా దాదాపు పది సినిమాల్లో నటించింది. కానీ అందులో ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. చాలా వరకు డిజాస్టర్లే అయ్యాయి. అయినా ఆమెకు అవకాశాలేమీ ఆగిపోలేదు. ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు వస్తూనే ఉన్నాయి. తెలుగులో మేఘా నటించిన ‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’ డిజాస్టర్లయిన సంగతి తెలిసిందే. తమిళంలో ఆమె డెబ్యూ మూవీ ‘ఎన్నై నొక్కి పాయుం తోటా’ సహా ఏవీ కూడా సరిగా ఆడలేదు.

అయినా సరే.. మేఘా చేతిలో ఇప్పుడు మూణ్నాలుగు సినిమాలున్నాయి. అందులో తెలుగు చిత్రం ‘రాజ రాజ చోర’ కూడా ఒకటి. శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతోనే మేఘా టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో మేఘా కథానాయిక అని ఇంతకుముందు తెలియదు. ఐతే శుక్రవారం రిలీజ్ చేసిన టీజర్లో మేఘా తళుక్కుమంది. టీజర్లో ఆమె బాగానే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం తెలుగులోనే కాక మొత్తంగా మేఘాకు తొలి విజయాన్ని అందిస్తుందేమో అన్న ఆశలు కలుగుతున్నాయి.

ఎందుకంటే ఇంతకుముందు రిలీజ్ చేసిన ‘రాజ రాజ చోర’ ప్రి టీజర్, ఇప్పుడొచ్చిన టీజర్.. రెండు కూడా ఆకట్టుకున్నాయి. చాలా సరదాగా సాగే సినిమాలా కనిపిస్తోందిది. శ్రీవిష్ణు చివరి హిట్ ‘బ్రోచేవారెవరురా’ టచ్ ఇందులోనూ కనిపిస్తోంది. ఈ చిత్రంలో మేఘాకు ఏమాత్రం రోల్ ఉంటుందో.. ఆమె ఏమేర ఆకట్టుకుంటుందో కానీ.. ఈ సినిమాతో అయినా ఆమెకు తొలి విజయం దక్కుతుందేమో చూడాలి.