దర్శకుడికి కమల్ హాసన్ రిక్వెస్ట్!

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం’ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. రెండు భాషల్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. రీసెంట్ గా దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సినిమాకి కొనసాగింపుగా మలయాళంలో ‘దృశ్యం 2’ని రూపొందించారు. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సీనియర్ హీరో వెంకటేష్ తెలుగు వెర్షన్ ‘దృశ్యం 2’ని మొదలుపెట్టారు. ఒరిజినల్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమా కోసం మిగిలిన ప్రాజెక్ట్ లను పక్కన పెట్టి మరీ షూటింగ్ ను పూర్తి చేశారు వెంకీ. తెలుగు వెర్షన్ ను కూడా ఓటీటీలో రిలీజ్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. దర్శకుడు జీతూ జోసెఫ్ తమిళంలో కూడా ‘దృశ్యం 2’ని రీమేక్ చేయాలనుకుంటున్నారు. ‘దృశ్యం’ మొదటి పార్ట్ ను తమిళంలో ‘పాపనాశం’ పేరుతో విడుదల చేశారు. ఇందులో కమల్ హాసన్, గౌతమి, నివేదా థామస్, ఎస్తర్ అనీల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పుడు ‘పాపనాశం 2’ కోసం కూడా వారినే తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే ఈ విషయంలో కమల్ హాసన్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘పాపనాశం’ సినిమా చేసే సమయానికి కమల్ హాసన్.. గౌతమితో సహజీవనం చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితమే వీరిద్దరూ విడిపోయారు. అప్పటినుండి ఇద్దరి మధ్య ఎలాంటి కాంటాక్ట్ లేదట. ఇప్పుడు ‘పాపనాశం 2’ కోసం ఆమెని తీసుకోవడం కమల్ కి ఇష్టం లేదట. ఒకవేళ సినిమా చేయాలనుకుంటే గనుక మీనా లేదా వేరే ఎవరినైనా తీసుకోమని చెబుతున్నారట. మరి ఈ విషయంలో జీతూ జోసెఫ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!