ప్రపంచవ్యాప్తంగా గత కొన్నేళ్లలో సినీ ప్రేక్షకుల అభిరుచి మారుతూ వస్తోంది. సినిమాల్నే పట్టుకుని వేలాడకుండా వెబ్ సిరీస్‌లనూ ఆదరిస్తున్నారు. వీటికి ప్రత్యేకంగా అభిమానగణం తయారైంది. ఇండియాలో కూడా ఈ ఒరవడి పెరుగుతోంది. హిందీలో వెబ్ సిరీస్‌లకు మంచి గిరాకీ ఉంటోంది.
తెలుగులో మాత్రం ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు అటు వైపు మళ్లుతున్నారు. లాక్ డౌన్ టైంలో చాలామంది వెబ్ సిరీస్‌ల రుచి చూసి.. వాటికి అలవాటు పడుతున్నారు. ఐతే తెలుగులో ఎంతైనా వెబ్ సిరీస్‌ల క్వాలిటీ తక్కువగానే ఉంటోంది.
పరిమిత వనరులతో ఏదో అలా లాగిస్తూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో ‘లూజర్’ అనే వెబ్ సిరీస్ ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుందని భావిస్తున్నారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌లో గురువారమే జీ5లో ఆరంభమైంది.
పది ఎపిసోడ్ల సిరీస్ చూసిన ప్రేక్షకులు వారెవా అంటున్నారు. తెలుగులో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ ఇదే అని కితాబిస్తున్నారు. రైఫిల్ షూటింగ్‌లో చిన్న వయసులోనే జాతీయ స్థాయికి ఎదిగిన ఓ షూటర్.. అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు చాలా దగ్గరా వెళ్లిన ఓ ఆటగాడు.. బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయిలో మెరిసే ప్రతిభ ఉన్న ఓ అమ్మాయి.. ఈ ముగ్గురి జీవితాల నేపథ్యంలో సాగే కథ లూజర్.
ప్రియదర్శితో పాటు శశాంక్, కల్పిక, షాయాజి షిండే ఇందులో కీలక పాత్రలు పోషించారు. కొత్త దర్శకుడు అభిలాష్ రెడ్డి సున్నితమైన భావోద్వేగాలతో ఈ సిరీస్‌ను ఆసక్తికరంగా నడిపించాడు. ప్రియదర్శి నటన సిరీస్‌కు హైలైట్‌గా నిలిచింది. భావోద్వేగాలు సరిగ్గా పండటం.. స్క్రీన్ ప్లేలో బిగి ఉండటంతో మొదలుపెడితే ఆపకుండా పది ఎపిసోడ్లు చూసేస్తున్నారు ప్రేక్షకులు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ సిరీస్‌కు మంచి స్పందన వచ్చిందంటే.. మున్ముందు ఇలాంటి మరిన్ని మంచి సిరీస్ చూడొచ్చు.