చిరు డైరెక్టర్ మారలేదు.. ఇదిగో క్లారిటీ!

ఈ మధ్యకాలంలో ఏ సినిమా మీద రానన్ని రూమర్స్ చిరంజీవి 153వ సినిమాపై వచ్చాయి. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న చిరు తన తదుపరి చిత్రంగా ‘లూసిఫర్’ రీమేక్ లో నటించాలనుకున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగు నేటివిటీకు తగ్గట్లుగా రూపొందించనున్నారు. ఈ సినిమా కోసం ముందుగా వినాయక్, సుజీత్ లాంటి దర్శకులను అనుకొని ఫైనల్ గా మోహన్ రాజాను ఫిక్స్ చేశారు.

అయితే సినిమాను లాంచ్ చేసి చాలా కాలం అవుతున్నప్పటికీ షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. పైగా ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో రకరకాల పుకార్లు మొదలయ్యాయి. మోహన్ రాజా చేసిన మార్పులు చిరుకి నచ్చలేదని.. దీంతో ఆయన కొన్నాళ్లు ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టనున్నారని వార్తలొచ్చాయి. ఇది కాకుండా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిరు సినిమాల షూటింగ్ లకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు కాబట్టి ‘లూసిఫర్’ రీమేక్ ఇప్పట్లో రాదంటూ మరికొన్ని వార్తలు వినిపించాయి.

ఇప్పటివరకు వీటిపై మెగా కాంపౌండ్ స్పందించింది లేదు. కానీ ఈరోజు మోహన్ రాజా పుట్టినరోజు సందర్భంగా ఈ రూమర్లకు చెక్ పెట్టింది. కొణిదెల ప్రొడక్షన్స్, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలు మోహన్ రాజాకు బర్త్ డే విషెస్ తెలిపాయి. ”మా #చిరు153 దర్శకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు” అనే పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాయి. అలా మరోసారి అధికారికంగా ఈ సినిమా గురించి క్లారిటీ ఇచ్చాయి. అంతేకాకుండా.. ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ పనులు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ‘ఆచార్య’ మిగిలిన పోర్షన్ పూర్తి కాగానే.. ‘లూసిఫర్’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది.