పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు తక్కువే చేశాడు. ‘తొలి ప్రేమ’తో నటుడిగా తనేంటో రుజువు చేసుకున్నప్పటికీ.. ఆ తర్వాత దర్శకులు పవన్ హీరోయిజాన్ని, అతడి స్టైల్‌ను ఎలివేట్ చేసే ప్రయత్నమే చేశారు. ఐతే ఇటీవలే విడుదలైన ‘వకీల్ సాబ్’లో పవన్ నట కౌశలాన్ని చూశారు ప్రేక్షకులు. కోర్టు నేపథ్యంలో నడిచే సన్నివేశాల్లో పవన్ నటన అభిమానులనే కాదు.. సామాన్య ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో హీరోయిజానికి స్కోప్ తక్కువే.
పవన్ మామూలుగా చూపించే మేనరిజమ్స్, స్టైల్ చూపించడానికి కూడా పెద్దగా అవకాశం లేకపోయింది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో పూర్తిగా కథ ప్రధానంగా నడిచిన ఈ సినిమాలో పెర్ఫామెన్స్‌తో సన్నివేశాలను ఎలివేట్ చేయాల్సి వచ్చింది. ఆ విషయంలో పవన్ పూర్తిగా విజయవంతం అయ్యాడు. పవర్ స్టార్‌లో ఇంత మంచి నటుడున్నాడా అనిపించేలా ఆయన పెర్ఫామ్ చేశాడంటే అతిశయోక్తి కాదు.
పవన్ కోర్టు సన్నివేశాలను ఎంతో ఓన్ చేసుకుని చేశాడన్న భావన ప్రేక్షకులకు కలిగింది. ఈ సన్నివేశాల విషయంలో పవన్ చూపించిన అంకిత భావం గురించి అందులో నివేథా థామస్ స్నేహితుడిగా, విలన్ బ్యాచ్‌లో ఒకడిగా నటించిన శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
రోజూ ‘వకీల్ సాబ్’ షూట్ అయిపోయాక తామందరం ఇంటికెళ్లి రిలాక్స్ అయితే.. పవన్ మాత్రం రాజకీయ అంశాల్లో బిజీ అయ్యేవారని.. మళ్లీ తర్వాతి రోజు సమయానికి సెట్‌కు వచ్చి కష్టపడేవారని శివ అన్నాడు. కోర్టు సన్నివేశాల్లో చాలా సుదీర్ఘమైన సంభాషణలు ఉంటాయని.. వాటిని పవన్ పెర్ఫామ్ చేసిన తీరుకు తామందరం ఆశ్చర్యపోయామని శివ అన్నాడు. క్లైమాక్స్‌కు ముందు వచ్చే సన్నివేశంలో 9 పేజీల డైలాగ్‌ను సింగిల్ టేక్‌లో పవన్ చెప్పి ఆశ్చర్యపరిచాడని.. ఆ సన్నివేశం పూర్తి కాగానే యూనిట్ మొత్తం చప్పట్లు కొట్టి ఆయన్ని అభినందించిందని.. స్టార్లు ఊరికే అయిపోయరనడానికి ఇది నిదర్శనం అని శివ చెప్పాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates