ఎన్టీఆర్ అభిమానుల నిరీక్ష‌ణ ఫ‌లించ‌బోతోందా?

ఈ మ‌ధ్యనే జూనియ‌ర్ ఎన్టీఆర్ కొత్త సినిమాను ప్ర‌క‌టించారు. ముందు అనుకున్న‌ట్లు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో కాకుండా త‌న 30వ సినిమాను కొరటాల శివ‌తో చేయ‌బోతున్నాడు తార‌క్. అనూహ్య ప‌రిణామాల మ‌ధ్య ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు మారాడు.

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత తార‌క్ ఈ సినిమానే చేయ‌బోతున్న‌ట్లుగా ధ్రువీక‌రిస్తూ ఇటీవ‌ల ప్ర‌క‌ట‌న ఇచ్చారు. ఐతే తార‌క్ అభిమానుల దృష్టి ఉన్న‌ది మాత్రం వేరే చిత్రం మీద‌. కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌తో తార‌క్ ఎప్పుడు సినిమా చేస్తాడు.. దీని గురించి అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుంది అని వాళ్లు ఎప్ప‌ట్నుంచో ఎదురు చూస్తున్నారు.

ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్, మైత్రీ సంస్థ అధినేత‌లు.. అలాగే తార‌క్ వేర్వేరు సంద‌ర్భాల్లో ఈ సినిమా గురించి సంకేతాలు ఇచ్చారు. కానీ అధికారికంగా ఘ‌న‌మైన ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుంద‌న్న దాని మీదే అభిమానుల దృష్టి ఉంది. మ‌ధ్య‌లో అనుకోకుండా ప్ర‌శాంత్ స‌లార్ సినిమాను తీసుకొచ్చిన నేప‌థ్యంలో మ‌ళ్లీ ఇలా ఇంకో సినిమా ఏదైనా వ‌చ్చి ప‌డుతుందేమో అన్న కంగారు కూడా వారిలో లేక పోలేదు.

ఈ నేప‌థ్యంలో ఈ సినిమా గురించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చి.. ఆ సినిమా ఎప్పుడు మొద‌లై, ఎప్పుడు విడుద‌ల‌వుతుందో ఒక క్లారిటీ వ‌స్తే బాగుండ‌ని అనుకుంటున్నారు. ఐతే ఇందుకు ఇప్పుడు ముహూర్తం కుదిరిన‌ట్లు స‌మాచారం. ఈ నెల 20న తార‌క్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌శాంత్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ చేయ‌నున్న సినిమా గురించి ఒక పోస్ట‌ర్ ద్వారా ఘ‌నంగా అనౌన్స్‌మెంట్ ఇవ్వ‌బోతోంద‌ట మైత్రీ సంస్థ‌.

సినిమా ఎప్పుడు మొద‌ల‌య్యేది.. ఎప్పుడు రిలీజ‌య్యేది కూడా ఈ పోస్ట‌ర్లో ప్ర‌క‌టిస్తార‌ని అంటున్నారు. మ‌రోవైపు ఆర్ఆర్ఆర్ టీం నుంచి తార‌క్ పుట్టిన రోజు నాడు కొత్త పోస్ట‌ర్ కూడా వ‌ద‌ల‌నున్నార‌ట‌. కొర‌టాల సినిమా నుంచి కూడా ఏదైనా స‌ర్ప్రైజ్ ఉంటుందేమో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.