కోలీవుడ్లో రెండు కరోనా విషాదాలు

కరోనా మహమ్మారి ధాటికి సినీ పరిశ్రమల్లోనూ తరచుగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్లో ఇటీవలే రైటర్ కమ్ డైరెక్టర్ నంద్యాల రవి కరోనాతో పోరాడి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అంతకుముందు జర్నలిస్టు, నటుడు టీఎన్ఆర్ కరోనాకు బలయ్యాడు. కోలీవుడ్లోనూ ఇలాంటి విషాదాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా కొన్ని గంటల వ్యవధిలో రెండు తమిళ సినీ కుటుంబాల్లో విషాదం నెలకొంది.

నితీష్ వీర అనే పేరున్న తమిళ నటుడు కరోనాతో పోరాడి అలసిపోయాడు. 45 ఏళ్ల వీర.. సోమవారం ప్రాణాలు కోల్పోయాడు. రెండు వారాల కిందట కరోనా బారిన పడ్డ వీర.. తాజాగా పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచాడు. ధనుష్ హీరోగా సెల్వ రాఘవన్ రూపొందించిన పుదుపేట్టై (తెలుగులో ధూల్ పేట) చిత్రంతో వీరకు బ్రేక్ వచ్చింది. అందులో అతను హీరోయిన్ సోనియా అగర్వాల్ సోదరుడిగా కనిపిస్తాడు. కథలో ఆ పాత్ర కీలకంగా ఉంటుంది.

ఆ తర్వాత రజినీకాంత్‌తో ‘కాలా’, ధనుష్ క్లాసిక్ మూవీ ‘అసురన్’ ఇంకా చాలా సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించాడు వీర. కెరీర్ మంచి ఊపులో ఉండగా వీర ఇలా చనిపోవడం కోలీవుడ్లో విషాదాన్ని నింపింది. మరోవైపు నటుడు, గాయకుడు, దర్శకుడు అయిన అరుణ్ రాజా కుటుంబంలోనూ కరోనా విషాదం నింపింది. అతడి భార్య ఇందుజ ఈ మహమ్మారికి బలైంది. అరుణ్ రాజా తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. ‘రాజా రాణి’ సినిమాలో ఆర్య ఫ్రెండుగా ఒక నీగ్రో తరహా పాత్రలో కనిపిస్తాడు అరుణ్. ఆ సినిమాలో అతను మంచి కామెడీ పండించాడు.

నటుడిగా మరిన్ని సినిమాల్లో నటించిన అరుణ్ రాజా.. కొన్నేళ్ల కిందటే మన తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రలో ‘కనా’ అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్టయింది. తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ పేరుతో రీమేక్ అయింది. ప్రస్తుతం తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, ఎమ్మెల్యే ఉదయనిధి హీరోగా హిందీ హిట్ మూవీ ‘ఆర్టికల్ 15’ రీమేక్‌ను కొన్ని రోజుల కిందటే మొదలుపెట్టాడు అరుణ్. ఇంతలో అతడి భార్య కరోనా బారిన పడటం.. కొన్ని రోజుల్లోనే ఆమె పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోవడం పెద్ద విషాదం.