పవన్‌తో అయిన వెంటనే.. మహేష్‌తో


బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ తెలుగులో చేసిన తొలి సినిమా ‘సవ్యసాచి’ పెద్ద డిజాస్టర్. రెండో సినిమా ‘మిస్టర్ మజ్ను’ సైతం నిరాశాజనక ఫలితాన్నే అందించింది. కానీ మూడో చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ మాత్రం బ్లాక్‌బస్టర్ అయి ఆమె రాతను మార్చేసింది. ఈ సినిమా విడుదలైన తర్వాత వెంటనే ఆమె కెరీర్ ఊపందుకోలేదు కానీ.. కొంచెం గ్యాప్ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశాన్నందుకుంది నిధి. ఆమె కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఛాన్స్.

పవన్‌తో పని చేయడమే పెద్ద ఛాన్స్ అనుకుంటే.. ఇప్పుడు పవర్ స్టార్ సమవుజ్జీ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిధి జత కట్టబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న మహేష్.. ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులోనే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోనుంది.

ఈ సినిమాలో కథానాయికగా నిధి నటించే అవకాశాలున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ గత రెండు సినిమాల్లోనూ పూజా హెగ్డేనే కథానాయికగా నటించింది. ఇప్పుడు మాటల మాంత్రికుడు ఫేవరెట్ ఆమే. మహేష్ సైతం ఇంతకుముందు పూజాతో కలిసి చేసిన ‘మహర్షి’తో మంచి విజయాన్నందుకున్నాడు కాబట్టి తనను హీరోయిన్‌గా తీసుకుంటే నో అనడు. కానీ పూజా డేట్లు ఖాళీ లేకపోవడంతో ఈ సినిమాలో నటించలేకపోతోందట.

తమిళంలో విజయ్ సరసన భారీ చిత్రంలో నటించే అవకాశం రావడంతో కోలీవుడ్లో పాగా వేయడానికి ఇదే మంచి ఛాన్స్ అని ఆమె బల్క్ డేట్లు ఇచ్చేసింది. వీటికి తోడు వేరే కమిట్మెంట్లు కూడా ఉండటంతో మహేష్-త్రివిక్రమ్ సినిమాకు ఆమె కాల్ షీట్స్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు. దీంతో ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న వాళ్లలో నిధినే బెస్ట్ అని ఆమెను ఈ సినిమా కోసం ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే వరుసగా పవన్, మహేష్‌ బాబులతో నటించబోతున్న నిధి కెరీర్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)