కొవిడ్ ధాటికి ఆ హీరోయిన్ భర్త కూడా..

తెలుగులో సూపర్ హిట్ మూవీ ‘బావ బావ మరిది’ సహా ఎన్నో చిత్రాల్లో నటించిన కన్నడ నటి మాలాశ్రీ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త, కన్నడ సినీ పరిశ్రమ దిగ్గజ నిర్మాతల్లో ఒకరిగా పేరున్న రాము కరోనా వైరస్‌ ధాటికి బలయ్యారు. ఆయన వయసు 52 ఏళ్లు.

రాముకు వారం కిందట కరోనా సోకింది. మొదట ఆయన ఇంటి దగ్గరే ఉండి వైద్యం పొందారు. కానీ నాలుగు రోజుల తర్వాత పరిస్థితి ఇబ్బందిగా మారడంతో బెంగళూరులోని రామయ్య ఆసుపత్రికి చేరారు. గత మూడు రోజుల్లో ఆయన పరిస్థితి దిగజారుతూ వచ్చింది. సోమవారం పూర్తిగా విషమించి రాము ప్రాణాలు పోయాయి. రాము, మాలాశ్రీలకు అనన్య అనే టీనేజీ అమ్మాయి ఉంది. రామును శాండిల్ వుడ్‌లో ట్రెండ్ సెట్టింగ్ ప్రొడ్యూసర్‌గా పేర్కొంటారు. ఆయనకు ‘కోటి రాము’ అనే పేరుండటం విశేషం. ఈ పేరు వెనుక ఆసక్తికర కథ ఉంది.

దక్షిణాదిన తెలుగు, తమిళ సినీ పరిశ్రమలతో పోలిస్తే వెనుకబడ్డ కన్నడ ఇండస్ట్రీల్లో ఒక స్థాయికి మించి బడ్జెట్ పెట్టేవారు కాదు ఒకప్పుడు. 90ల్లో మన దగ్గర కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నపుడు అక్కడ సినిమాల బడ్జెట్లు రూ.50-60 లక్షలకు మించేవి కావు. అలాంటి సమయంలో రాము ఏకంగా కోటి రూపాయల బడ్జెట్లో సినిమా తీశాడు. దీంతో అప్పుడు అతడి పేరు మార్మోగిపోయింది. ‘కోటి రాము’ అనే పేరొచ్చింది. ఆ తర్వాత కూడా రాము చాలా వరకు భారీ బడ్జెట్ సినిమాలే తీశాడు.

కెరీర్ మొత్తంలో దాదాపు 40 చిత్రాలు ప్రొడ్యూస్ చేశాడు రాము. అందులో భార్య మాలాశ్రీని పెట్టి తీసిన సినిమాలు కూడా ఉన్నాయి. మన సాయికుమార్‌కు కన్నడలో దక్కిన పెద్ద హిట్లలో ఒకటైన ‘ఏకే 47’కు నిర్మాత రామునే. వివిధ భాషల్లో భారీ సినిమాలు చేసి 90ల్లో టాప్ సౌత్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్నా మాలాశ్రీని రాము విచిత్రమైన పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నారు. ఆమె మొదట యాక్సిడెంట్లో తన తల్లిని కోల్పోగా.. ఆమె పెళ్లి చేసుకోవాలనుకున్న కో యాక్టర్ సునీల్ సైతం తర్వాత యాక్సిడెంట్లోనే చనిపోయాడు. ఆ తర్వాత కొంత కాలానికి మాలాశ్రీని రాము పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత భర్త నిర్మాణంలో మాలాశ్రీ పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించింది.