“రాముడు అయోధ్య లో ఉన్నా, అడవిలో ఉన్నా ప్రజలకు దేవుడే”
“నా అనుకున్న వాళ్లు నన్ను మోసం చేసినా , వాళ్ళ కోసం నేను నిలబడతా, పోరాడుతా”
“మీరు నేను వేరు కాదు. మీ బాధలన్నీ నాకు తెలుసు. మనం కలిసి పోరాడదాం”
“ఆశ ఉన్నవాడే గెలుపు ఓటముల గురించి ఆలోచిస్తాడు. ఆశయం ఉన్నవాడికి ప్రయాణం మాత్రమే గుర్తుంటుంది”
‘వకీల్ సాబ్’ సినిమాలో కొన్ని డైలాగులు ఇవి. సినిమాలో సందర్భానికి సరిగ్గానే సరిపోయినట్లే అనిపిస్తాయి కానీ.. అవే సమయంలో వీటి వెనుక ఉద్దేశాలు వేరని స్పష్టంగా తెలిసిపోతూనే ఉంటుంది. ఈ డైలాగులు పేలినపుడు పవర్ స్టార్‌గా కంటే కూడా జనసేనానిగా కనిపిస్తాడు పవన్ కళ్యాణ్.
ఒక రాజకీయ నేతగా తన ఉద్దేశాన్ని, ఆలోచనలను బలంగా చెప్పడానికి పవన్ ‘వకీల్ సాబ్’ను బాగానే ఉపయోగించుకున్నాడు. రాజకీయాలతో టచ్ ఉన్న వాళ్లు, భవిష్యత్తులో అటు వైపు అడుగు వేయాలనుకున్న వాళ్లు తాము నటించే సినిమాల ద్వారా తమ ఆలోచనలు, ఉద్దేశాల్ని చెప్పే ప్రయత్నం చేయడం మామూలే. ఐతే పవన్ సామాజిక అంశాలతో కూడిన సినిమాలు చేశాడు కానీ.. ఇలా పర్టికులర్‌గా డైలాగులు పేల్చే ప్రయత్నం చేయలేదు.
కానీ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లడం కోసం గ్యాప్ తీసుకుని.. మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ ‘వకీల్ సాబ్’తో రీఎంట్రీ ఇచ్చిన పవన్.. ఈ సినిమాలో మాత్రం బోలెడన్ని పొలిటికల్ టచ్ ఉన్న డైలాగులు పేల్చాడు. ఐతే అవేమీ కృత్రిమంగా అనిపించలేదు. సినిమాను చెడగొట్టలేదు. బాగానే సింక్ అయ్యాయి. పవన్ పనిగట్టుకుని ఇలా డైలాగులు రాయించుకున్నాడా.. లేక పవన్ వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను అర్థం చేసుకుని దర్శకుడు వేణు శ్రీరామ్ ఇలాంటి డైలాగులు పెట్టాడా అన్నది తెలియదు కానీ.. థియేటర్లలో మాత్రం ఈ డైలాగులు భలేగా పేలాయి.
తనను ప్రజలు గెలిపించకపోయినా వాళ్లతోనే ఉంటానని, వాళ్ల కోసం పోరాడతానని బలంగా చెప్పే ప్రయత్నం చేశాడు పవన్. అసలు ‘వకీల్ సాబ్’ లాంటి మంచి సందేశం మిళితమైన కథను రీఎంట్రీ కోసం ఎంచుకోవడంలోనూ పవన్ తెలివైన అడుగు వేశాడని.. ఈ సినిమా ఆయనకు పొలిటికల్ మైలేజి కూడా ఇస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates