ప్రధాన మంత్రి అపాయింట్మెంట్ అంటే అంత తేలిగ్గా సాధ్యమయ్యే విషయం కాదు. కొన్నిసార్లు ముఖ్యమంత్రులకు కూడా అపాయింట్మెంట్ దక్కదు. పెద్ద స్థాయి వ్యక్తులకు కూడా అలా తిరస్కారం చూపించే ప్రధాన మంత్రి కార్యాలయం కొన్నిసార్లు.. స్థాయి చూడకుండా అపాయింట్మెంట్ ఇస్తుంటుంది. ప్రస్తుతం అదే తరహాలో తమిళ నటుడు మాధవన్ ప్రధాని మోడీ అపాయింట్మెంట్ సాధించాడు. ఒక గొప్ప వ్యక్తి గురించి సినిమా తీయడం ద్వారా ఆయన ప్రధాని దృష్టిని ఆకర్షించారు.
పద్మభూషణ్ గ్రహీత అయిన రాకెట్ సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా మాధవన్ ‘రాకెట్రీ’ పేరుతో స్వీయ దర్శకత్వంలో సినిమా తీయడమే కాదు.. ఇందులో లీడ్ రోల్ చేశారు, అలాగే నిర్మాణ భాగస్వామిగానూ ఉన్నారు. ఈ సినిమా కోసం మాధవన్ నాలుగేళ్ల సమయాన్ని వెచ్చించడం విశేషం.
రాకెట్ సైన్స్‌లో గొప్ప పరిజ్ఞానం సంపాదించి ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలకు దీటుగా ఎదిగి.. ఎన్నో దేశాల నుంచి ఆహ్వానాలు అందుకున్న వ్యక్తి నంబి నారాయణన్. ఇస్రో చేపట్టిన అనేక గొప్ప ప్రాజెక్టుల్లో భాగస్వామి అయిన నంబి మీద దేశద్రోహం ఆరోపణలు వచ్చి ఆయన అప్రతిష్ట పాలు కావడం.. ఎన్నో ఏళ్లు న్యాయస్థానాల్లో పోరాడాల్సి రావడం విచారకరం. ఐతే ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని సుప్రీం కోర్టు తేల్చేయడమే కాదు.. నంబి పేరు ప్రతిష్టలు దెబ్బ తీసినందుకు గాను రూ.50 లక్షల పరిహారం కూడా అందేలా ఆదేశాలు ఇచ్చింది.
ఎన్నో మలుపులున్న నంబి జీవితంపై సినిమా తీయడానికి మాధవన్ సంకల్పించాడు. నంబి గొప్పదనాన్ని గుర్తించిన మోడీ సర్కారు రెండేళ్ల కిందట పద్మభూషణ్ పురస్కారాన్ని అందించింది. ఇప్పుడు తన సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సమయాన ప్రధాన మంత్రిని మాధవన్‌తో పాటు వెళ్లి మోడీని కలిశాడు నంబి. సంబంధిత ఫొటోలను మాధవన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇలా ఇద్దరు సినిమా వ్యక్తులకు.. వారి సినిమా విడుదలకు ముందు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వడం విశేషమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates