పవర్ స్టార్ ఊచకోత


తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకడు. ఐతే మూడేళ్లకు పైగా పవర్ స్టార్ నుంచి సినిమా లేక వెర్రెత్తిపోయి ఉన్నారు అతడి అభిమానులు. ఒక దశలో ఇకపై సినిమాలే చేయను అన్న పవన్.. ఆ తర్వాత ఆలోచన మార్చుకుని ‘వకీల్ సాబ్’తో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా కోసం అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కరోనా విరామం తర్వాత రాబోతున్న తొలి భారీ చిత్రం ఇదే కావడమే అందుక్కారణం. ఈ సినిమాపై ఏ స్థాయిలో హైప్ ఉందో చెప్పడానికి దీని ట్రైలర్ బద్దలు కొడుతున్న రికార్డులే రుజువు. యూట్యూబ్ టీజర్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేస్తూ సంచలనం రేపుతోంది ‘వకీల్ సాబ్’ సినిమా.

కేవలం 18 గంటల్లో ‘వకీల్ సాబ్’ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో 1.3 కోట్ల వ్యూస్ రావడం గమనార్హం. లైక్స్ ఇప్పటికే 9 లక్షలు దాటిపోయాయి. ఇప్పటిదాకా ఏ తెలుగు ట్రైలర్ కూడా ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని వ్యూస్, ఇన్ని లైక్స్ సంపాదించాలేదు. ఫాస్టెస్ట్ వ్యూస్, లైక్స్ రికార్డులన్నీ ‘వకీల్ సాబ్’ దెబ్బకు బద్దలైపోయాయి. ఈ ట్రైలర్‌కు కేవలం 7 నిమిషాల్లో లక్ష లైక్స్ రావడం విశేషం. 20 నిమిషాల్లో 2 లక్షల లైక్స్, 40 నిమిషాల్లో 3 లక్షల లైక్స్ వచ్చాయి.

పాన్ ఇండియా సినిమా అయిన ‘సాహో’ ట్రైలర్‌కు 4 గంటల 50 నిమిషాల్లో 3 లక్షల లైక్స్ వచ్చాయి. ఇప్పటిదాకా అదే టాలీవుడ్ రికార్డు. ఆ రికార్డును ‘వకీల్ సాబ్’ ట్రైలర్ 40 నిమిషాల్లోనే బద్దలు కొట్టిందంటే పవర్ అభిమానుల ఊపు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ట్రైలర్ ఉండటంతో సినిమాకు హైప్ మరింత పెరిగిపోతోంది.