రాజమౌళి-కీరవాణి కుటుంబంలో దాదాపుగా అందరూ సినిమాలతో మమేకం అయినవాళ్లే. వారిలో ఒక్కొక్కరి ప్రతిభ, నైపుణ్యాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కీరవాణి, రాజమౌళిల తండ్రులు శివశక్తి దత్తా, విజయేంద్ర ప్రసాద్‌ల నుంచి మొదలుపెడితే ఎంతోమంది ప్రతిభావంతులు పరిశ్రమలోకి అడుగు పెట్టారు. తమ సత్తా చాటుకున్నారు. రెండేళ్ల కిందట ‘మత్తువదలరా’ సినిమాతో నటుడిగా సింహా, సంగీత దర్శకుడిగా కాలభైరవ అరంగేట్రంలోనే ఆకట్టుకున్నారు.
వీళ్లు మామూలోళ్లు కాదు అనిపించారు. హీరోగా అరంగేట్రం చేసే కుర్రాళ్లు మామూలుగా మాస్ ఇమేజ్ కోసం తపించి పోతుంటారు. రొటీన్ కమర్షియల్ సినిమాలు చేస్తుంటారు. కానీ సింహా మాత్రం భిన్నమైన థ్రిల్లర్‌తో హీరోగా పరిచయం అయ్యాడు. నిజానికి అందులో అతడి పాత్రలో హీరోయిజం కనిపించదు. మిగతా పాత్రధారుల్లో ఒకడిగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాను ఎంచుకోవడంలో అతడి అభిరుచి కనిపించింది. కాలభైరవ సైతం చక్కటి సంగీతంతో తన ప్రతిభ చాటుకున్నారు. ఈ ఇద్దరూ రాజమౌళి-కీరవాణి కుటుంబ ప్రతిష్ఠను మరింత పెంచారు.
తొలి సినిమా తర్వాత సింహా మీద అంచనాలు పెరిగాయి. అతను ఏం చేసినా కొత్తగా ఉంటుందనే భరోసా కలిగింది. ‘తెల్లవారితే గురువారం’తో అతను మరో హిట్ కొడతాడనే నమ్మకం ఏర్పడింది ప్రేక్షకుల్లో. ఈ సినిమా ట్రైలర్ కూడా ఆసక్తికరంగా అనిపించింది. కానీ సినిమా చూస్తే ఆ అంచనాలకు సమీపంలో కూడా లేకపోయింది. ఇంత సాదాసీదా కథను రాజమౌళి అండ్ కో ఎలా ఓకే చేసిందన్నది అర్థం కాని విషయం. పూర్తిగా సినిమాలో ఇన్వాల్వ్ అయి ఉండకపోవచ్చు కానీ.. ఏదో ఒక దశలో వారి జోక్యం లేకుండా ఉండి ఉండదు. వాళ్లు వేలు పెట్టలేదు అనుకున్నా.. ‘మత్తువదలరా’తో తమ అభిరుచిని చాటిని సింహా, కాలభైరవలకు ఈ సినిమాకు పని చేస్తున్నపుడు ఇది వర్కవుట్ కాదని ఎక్కడా అనిపించలేదంటే ఆశ్చర్యమే.
బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానికి పూర్తిగా తిరస్కారం ఎదురైంది. ఇలాంటి చిన్న సినిమాలకు టాక్ ఎంతో కీలకం. చూసిన వాళ్లందరూ హ్యాండ్స్ డౌన్ అంటుండటంతో కనీస స్పందన కరవై రిలీజ్ ఖర్చులు తప్ప ఏమీ వెనక్కి రాని పరిస్థితి నెలకొంది. దీని బదులు నేరుగా ఓటీటీలో సినిమాను రిలీజ్ చేసినా బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి