కంగ‌నా.. ఇంకొక్క‌టి కొడితే


ఈ త‌రంలో త‌న‌ను మించిన క‌థానాయిక ఇండియాలో లేద‌ని కంగ‌నా ర‌నౌత్ మ‌రోసారి చాటి చెప్పింది. ఆమె త‌న ఖాతాలోకి నాలుగో జాతీయ అవార్డును వేసుకుంది. వ్య‌క్తిగ‌తంగా కంగ‌నా ఎంత‌టి వివాదాస్ప‌దురాలో.. ముఖ్యంగా గ‌త ఏడాది కాలంలో ఆమె పొలిటిక‌ల్ ప్రాప‌గండాల్లో భాగంగా మారి సోష‌ల్ మీడియాలో ఎంత ర‌చ్చ చేస్తోందో తెలిసిందే. కానీ న‌టిగా మాత్రం కంగ‌నా స్థాయి వేరు. తెర‌మీద ఆమె పెర్ఫామెన్స్ చూసి ఫిదా అవ్వ‌ని వాళ్లు లేరు.

ఇప్పుడు కంగ‌నా మ‌రోసారి జాతీయ ఉత్త‌మ న‌టిగా ఎంపిక కావ‌డానికి మోడీ స‌ర్కారు అండే కార‌ణం అనే వాళ్లూ లేక‌పోలేదు. కానీ మ‌ణిక‌ర్ణిక‌, పంగా సినిమాల్లో కంగ‌నా న‌ట‌న చూశాక ఆమె ఈ అవార్డుకు అర్హురాల‌నే అనిపిస్తుంది. న‌టిగా ఆమె కొత్త‌గా రుజువు చేసుకోవాల్సిందేమీ కూడా లేదు. ఇప్ప‌టికే ఎన్నో అద్భుత‌మైన పాత్ర‌ల‌తో ఆమె స‌త్తా చాటుకుంది.

ఫ్యాష‌న్ సినిమాలో న‌ట‌న‌కు గాను తొలిసారి కంగ‌నా ఉత్త‌మ స‌హాయ న‌టిగా జాతీయ అవార్డు గెలుచుకుంది. ఆ త‌ర్వాత క్వీన్, త‌ను వెడ్స్ మ‌ను రిటర్న్స్ సినిమాల‌కు ఉత్త‌మ న‌టిగా జాతీయ పుర‌స్కారాలు గెలుచుకుంది. ఇప్పుడు నాలుగో అవార్డును సొంతం చేసుకుంది. ఆమె ఇంకొక్క జాతీయ అవార్డు గెలిస్తే.. ఇండియాలో అత్య‌ధిక జాతీయ అవార్డులు సాధించిన న‌టిగా లెజెండ‌రీ ష‌బానా ఆజ్మీ స‌ర‌స‌న చేరుతుంది కంగ‌నా.

షబానా అంకుర్, అర్థ్, కాందార్, పార్, గాడ్ మ‌ద‌ర్ సినిమాల‌కు జాతీయ ఉత్త‌మ న‌టిగా ఎంపికైంది. ఐదుసార్లూ ఆమె ఉత్త‌మ న‌టి పుర‌స్కారాన్నే గెలుచుకుంది. కంగ‌నా మూడుసార్లు ఉత్త‌మ న‌టిగా, ఒక‌సారి ఉత్త‌మ స‌హాయ న‌టిగా అవార్డులు సాధించింది. ఎలా అయితేనేం ఆమె ఖాతాలో నాలుగు పుర‌స్కారాలున్నాయి. ఇంకో అవార్డు సాధిస్తే ష‌బానాను స‌మం చేసి చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది కంగ‌నా. ఆమెక‌ది క‌ష్టం కాక‌పోవ‌చ్చు.