హాలీవుడ్ దర్శకుడితో ఏం సాధించినట్లు?


మంచు విష్ణు చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో కూడా జనాలు మరిచిపోయారు. మంచు ఫ్యామిలీలోని మిగతా నటుల్లాగే అతడికీ గడ్డు కాలం నడుస్తోంది చాలా ఏళ్లుగా. ఇంకా చెప్పాలంటే మిగతా వాళ్లతో పోలిస్తే విష్ణు పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. చివరగా అతణ్నుంచి వచ్చిన ‘ఓటర్’ సినిమాకు రిలీజ్ ఖర్చులు కూడా రాలేదంటే పరిస్థితి అర్థ:చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో తన కెరీర్‌ను గాడిన పెట్టుకోవడానికి స్వయంగా మంచు విష్ణునే రంగంలోకి దిగాడు.

ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ స్కామ్ గురించి తెలుసుకుని.. దాని ఆధారంగా స్వయంగా కథ తయారు చేశాడు. తమ కుటుంబ ఆస్థాన రచయితగా మారిన డైమండ్ రత్నబాబుతో కలిసి దానికి మెరుగులు దిద్దుకున్నాడు. ముంబయి నుంచి కొందరు ఐటీ నిపుణులు కలిసి అమెరిక్లను బురిడీ కొట్టించి ఏకంగా రూ.2600 కోట్లు కొట్టేయడం అంటే చిన్న విషయం కాదు. దీన్ని కథా వస్తువుగా ఎంచుకోవడం తెలివైన నిర్ణయమే.

మంచి థ్రిల్లర్ లక్షణాలున్న కథను ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దే దర్శకుడు అవసరం. ఐతే మన దగ్గర థ్రిల్లర్లు చక్కగా తీసే దర్శకులు చాలామంది ఉన్నారు. పేరున్న దర్శకులతో వద్దనుకుంటే.. షార్ట్ ఫిలిమ్స్‌తో గొప్ప పనితనం చూపిస్తున్న వర్ధమాన దర్శకులకు కొదవలేదు. ఎలాగూ మంచు విష్ణుకు, అతడి టీంకు సినిమాలు తీయడంలో మంచి అనుభవం ఉంది. అలాంటపుడు కొంచెం బ్యాకప్ ఇచ్చి ఏ యువ దర్శకుడికో అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ ఇక్కడెవరూ పనికి రారని.. ఎక్కడో హాలీవుడ్ నుంచి జెఫ్రీ జీ చిన్ అనే దర్శకుడిని పట్టుకొచ్చారు. అతనేమీ కొమ్ములు తిరిగిన వాడు కాదు. ఒక షార్ట్ ఫిలిం మాత్రమే తీశాడు. అది కూడా ఎప్పుడో 2012లో. అప్పట్నుంచి ఖాళీనే.

తెలుగులోనే మార్కెట్ కోల్పోయి హిట్టు కోసం అల్లాడుతున్న విష్ణు ‘మోసగాళ్ళు’ చిత్రాన్ని ఇంగ్లిష్‌లో తీసి హాలీవుడ్లో రిలీజ్ చేయాలనుకోవడమే విడ్డూరం. అందుకోసమే హాలీవుడ్ దర్శకుడిని ఎంచుకున్నట్లున్నాడు. కానీ సినిమా చూస్తే మన తెలుగు చిత్రాల ప్రమాణాల్లోనూ లేకపోయింది. థ్రిల్లర్ సినిమాలకు ఉండాల్సిన మినిమం క్వాలిటీస్ ‘మోసగాళ్ళు’లో కనిపించలేదు. మరి హాలీవుడ్ దర్శకుడిని పెట్టుకుని ఏం సాధించినట్లు.. ఇలాంటి సినిమాను తీసుకెళ్లి ఇంగ్లిష్‌లో ఎలా రిలీజ్ చేయాలనుకున్నట్లు?