నాగార్జున‌కు జోడీగా కాజ‌ల్‌?

టాలీవుడ్లో తండ్రీ కొడుకుల‌తో రొమాన్స్ చేసిన హీరోయిన్లు చాలా కొద్దిమందే. అందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఒక‌రు. ఆమె ముందు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో జోడీ క‌ట్టింది. వీళ్లిద్ద‌రి క‌ల‌యిక‌లో మ‌గ‌ధీర‌, నాయ‌క్, గోవిందుడు అంద‌రివాడేలే సినిమాలు వ‌చ్చాయి. త‌ర్వాత ఆమె చిరంజీవితో ఖైదీ నంబ‌ర్ 150లో జోడీ క‌ట్టింది. కొంత త‌ర్జ‌న‌భ‌ర్జ‌న త‌ర్వాత కొడుకు హీరోయిన్‌ను త‌న సినిమాలోకి తీసుకున్నాడు చిరు. ఇప్పుడు ఆచార్య‌లోనూ చిరుకు జోడీగా కాజ‌ల్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

కాగా కాజ‌ల్ మ‌రో సీనియ‌ర్ హీరోతో జోడీ క‌ట్ట‌బోతున్న‌ట్లు తాజా స‌మాచారం. ఆ హీరో మ‌రెవ‌రో కాదు.. అక్కినేని నాగార్జున‌. చంద‌మామ ఇప్ప‌టికే ద‌డ సినిమాలో నాగ‌చైత‌న్య‌తో రొమాన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు చైతూ తండ్రి నాగ్ స‌ర‌స‌న సినిమా చేయ‌బోతోంద‌ట‌.

త్వ‌ర‌లోనే వైల్డ్ డాగ్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నున్న నాగ్.. ప్ర‌వీణ్ స‌త్తారుతో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులోనూ ఆయ‌న అండ‌ర్ క‌వ‌ర్ పోలీసాఫీర్‌గానే క‌నిపించ‌నున్నాడు. ఈ థ్రిల్ల‌ర్ మూవీలో నాగార్జున‌కు జోడీగా కాజ‌ల్‌ను ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. కాజ‌ల్ పెళ్లి త‌ర్వాత కూడా జోరుగానే సినిమాల్లో న‌టిస్తోంది. కాక‌పోతే ఇంత‌కుముందులా యంగ్ హీరోల‌కు ప‌రిమితం కావ‌డం లేదు. తెలుగులో చిరుతో, త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్‌తో ఆమె సినిమాలు చేస్తోంది.

ఇప్పుడు నాగ్ రూపంలో మ‌రో సీనియ‌ర్ హీరో ఆమెతో రొమాన్స్ చేయ‌నున్నాడు. ఇలా ఈ త‌రంలో ఇద్ద‌రు యంగ్ హీరోల‌తో.. వారి తండ్రుల‌తో న‌టించిన అరుదైన క‌థానాయిక‌గా కాజల్ రికార్డు సృష్టించ‌బోతోంది. ఒక‌ప్పుడు త‌న తండ్రి ఏఎన్నార్‌తో జోడీ క‌ట్టిన శ్రీదేవితో నాగ్ క‌లిసి సినిమా చేశాడు. ఇప్పుడు కొడుకు హీరోయిన్‌తో రొమాన్స్ చేయ‌బోతున్న అరుదైన ఘ‌న‌త ఆయ‌న సొంతం కానుంది.