ఆస్కార్ రేసులోంచి సూర్య సినిమా ఔట్

తెలుగు వాళ్లు అమితంగా ఇష్టపడే తమిళ హీరో సూర్యకు చాన్నాళ్ల తర్వాత మంచి విజయాన్నందించిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా’. తమిళంలో ‘సూరారై పొట్రు’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం కరోనా నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. అక్కడ అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. ఈ సినిమా థియేటర్లలో రిలీజై ఉంటే అలవోకగా వంద కోట్ల వసూళ్లు సాధించేది. గత ఏడాదికి సౌత్ ఇండియాలో హైయెస్ట్ గ్రాస్ కూడా అయ్యేదేమో.

విమర్శకుల నుంచి గొప్ప ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల కోసం రేసులో నిలిచిన సంగతి తెలిసిందే. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీతం విభాగాల్లో ఈ చిత్రం ఇండిపెండెంట్‌గా ఆస్కార్ అవార్డులకు పోటీ పడింది. ఐతే ఈ సినిమా ఏ విభాగంలోనూ తుది జాబితాలో నిలవలేకపోయింది. తాజాగా ప్రకటించిన నామినేషన్ జాబితాలో ‘సూరారై పొట్రు’కు చోటు దక్కలేదు.

మామూలుగా ఉత్తమ విదేశీ చిత్రం విభాగానికి ఆయా దేశాలు అధికారికంగా సినిమాలను పంపిస్తుంటాయి. ఇండియా ప్రతి ఏడాదీ ఒక సినిమాను ఆస్కార్ అవార్డులకు ఇలా నామినేట్ చేస్తుంది. ‘సూరారై పొట్రు’ ఈ తరహాలో కాకుండా వ్యక్తిగతంగా ఆస్కార్ అవార్డులకు పోటీ పడింది.

ముందు ఈ సినిమాను నామినేషన్ కోసం ఆస్కార్ అవార్డుల కమిటీ కన్సిడర్ చేయడమే గొప్ప విషయం. ఏ సినిమాను పడితే ఆ సినిమాను పంపిస్తే పరిశీలన కూడా ఉండదు. కానీ ‘సూరారై పొట్రు’లో విషయం ఉండటంతో దాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. స్క్రీనింగ్ కూడా జరిగింది. కానీ ఆస్కార్ అవార్డుల ప్రమాణాలకు తగ్గట్లు లేకపోవడంతో ఇది ఏ విభాగంలోనూ నామినేట్ కాలేకపోయింది. ఐతే గత ఏడాదికి జాతీయ అవార్డులు ప్రకటిస్తే మాత్రం ‘సూరారై పొట్రు’ లాంటి ఇన్‌స్పైరింగ్ మూవీ కచ్చితంగా కొన్ని పురస్కారాలు అందుకుంటుందని భావిస్తున్నారు. తమిళనాడు స్టేట్ అవార్డ్స్‌లో కూడా ఇది సత్తా చాటే అవకాశముంది.