సందీప్ కిషన్ మినహా అందరూ..

సంక్రాంతి సందడి తర్వాత వారం వారానికి విడుదలయ్యే కొత్త సినిమాల సంఖ్య పెరిగిపోతోంది. గత శుక్రవారం ఏకంగా ఎనిమిది సినిమాల దాకా రిలీజయ్యాయి. ఐతే రాశి తప్పితే వాసి పెద్దగా లేకపోవడమే ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది. పేరుకు ఎనిమిది సినిమాలు రిలీజయ్యాయి కానీ.. ఇందులో కొన్ని మరీ నామమాత్రంగా రిలీజయ్యాయి.

తారకరత్న సినిమా ‘దేవినేని’ని పట్టించుకున్న వాళ్లు లేరు. అలాగే డబ్బింగ్ సినిమాలు ‘విక్రమార్కుడు’, ‘గజకేసరి’ల పరిస్థితి కూడా అంతే. మిగతా కొత్త చిత్రాల్లో ‘ఎ’ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది కానీ.. ఆ కాన్సెప్ట్‌ను సరిగా ఎగ్జిక్యూట్ చేయలేదు. ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేని నటీనటులు, టెక్నీషియన్లు కలిసి చేయడంతో ఇది ప్రేక్షకుల దృష్టిలో పడలేకపోయింది. దిల్ రాజు రిలీజ్ చేసిన ‘షాదీ ముబారక్’, సుకుమార్ మిత్రుడు హరి ప్రసాద్ జక్కా తీసిన ‘ప్లే బ్యాక్’ చిత్రాలు పర్వాలేదన్న టాక్ వచ్చింది.

కానీ ఇవి కూడా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయాయి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయాయి. ఇక ‘ఒరేయ్ బుజ్జిగా’ తర్వాత రాజ్ తరుణ్, విజయ్ కుమార్ కొండా తమ శైలికి భిన్నంగా ‘పవర్ ప్లే’ అనే థ్రిల్లర్ మూవీ చేయగా.. ఇది ప్రేక్షకులను పూర్తిగా నిరాశకు గురి చేసింది. దీనికి పూర్ ఓపెనింగ్స్ వచ్చాయి. వీకెండ్లోనూ ఈ సినిమా ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయింది. మొత్తంగా పై ఏడు సినిమాలకూ బాక్సాఫీస్ దగ్గర తిరస్కారం తప్పలేదు. మిగిలిన ఒక్క సినిమా ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ వీకెండ్‌ను బాగానే ఉపయోగించుకుంది. ఈ వారం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన ఏకైక సినిమా ఇదే.

ప్రి రిలీజ్ బజ్ బాగానే ఉండటం ఓపెనింగ్స్‌కు ఉపయోగపడింది. వీకెండ్ అంతా మంచి వసూళ్లే వచ్చాయి. షేర్ రూ.4 కోట్ల దాకా వచ్చినట్లుంది. ఐతే సినిమాకు యావరేజ్ టాక్ ఉండటంతో వీకెండ్ తర్వాత ఈ సినిమా నిలబడ్డం కష్టంగానే ఉంది. సోమవారం సినిమాకు వచ్చే షేర్‌ను బట్టి అంతిమ ఫలితం ఆధారపడి ఉంటుంది. గురువారం కొత్తగా మూడు పేరున్న సినిమాలు వస్తుండటంతో ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ సెకండ్ వీకెండ్లో నిలబడటం డౌటే.