తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో కోట శ్రీనివాసరావు ఒకరు. విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, లీడ్ రోల్.. ఇలా ఎన్నో అవతారాల్లో ఆయన తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరించారో తెలిసిందే. 80వ దశకం నుంచి మొదలుపెడితే ఒక మూడు దశాబ్దాల పాటు ఆయన హవా అప్రతిహతంగా సాగింది. దేశంలోనే అత్యంత గొప్ప నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.
ఐతే కొన్నేళ్లుగా ఆయన పెద్దగా సినిమాలు చేయట్లేదు. వయసు ప్రభావంతో ఒంట్లో ఓపిక తగ్గింది. ఎప్పుడైనా సినిమా చేసినా.. ఇంతకుముందులా తెరపై హుషారుగా కనిపించట్లేదు. తాజాగా వచ్చిన ‘పవర్ ప్లే’ సినిమాలో కోట మరీ నీరసంగా కనిపించారు. డైలాగ్ చెప్పడానికి కూడా ఇబ్బంది పడిపోయారు. ఈ నేపథ్యంలోనే మన ఫిలిం మేకర్స్ కోటను సినిమాల్లోకి తీసుకోవడం తగ్గించేసినట్లున్నారు. ఐతే ఈ మధ్య తాను చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లకు ఫోన్ చేసి సినిమా అవకాశాలు అడిగినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో కోట వెల్లడించడం గమనార్హం.
ఎన్నో ఏళ్ల పాటు విరామం లేకుండా సినిమాలు చేసిన తాను.. గత ఏడాది కరోనా-లాక్ డౌన్ కారణంగా పూర్తిగా సినిమాలకు దూరమై ఇంటిపట్టున ఉండిపోయానని.. ఆ టైంలో తనకు చాలా బోర్ కొట్టేసిందని కోట చెప్పారు. ఆ విరామం తర్వాత తాను సినిమా అవకాశాల కోసం చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో పాటు వి.వి.వినాయక్‌కు కూడా ఫోన్ చేసినట్లు చెప్పి కోట ఆశ్చర్యపరిచారు.
క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమాలో తాను ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చాలా కాలం తర్వాత పవన్‌తో నటించడం చాలా ఆనందంగా ఉందని, తన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోట అంతటివాడు అడిగాడంటే చిరంజీవి, వినాయక్ కూడా తమ సినిమాల్లో ఆయనకు అవకాశాలివ్వకుండా పోరు. డబ్బుల కోసం కాకపోయినా ఇన్నేళ్ల పాటు నటించాక ఊరికే ఉండటం ఇష్టం లేక సినిమాల్లో నటించాలని కోట భావిస్తూ ఉండవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates