తెలుగు దృశ్యం-2లో ఎవ‌రెవ‌రు?

మ‌లయాళ సినిమా దృశ్యం-2లో చ‌డీచ‌ప్పుడు లేకుండా విడుద‌లైంది. ప్రేక్ష‌కుల అంచ‌నాలు మించిపోయి అద్భుత స్పంద‌న రాబ‌ట్టుకుంది. కొన్ని రోజుల‌కే తెలుగు రీమేక్ ఖరారైపోయింది. ఇంత‌లోనే సినిమా ప‌ట్టాలెక్కేసింది. మంగ‌ళ‌వార‌మే ఈ సినిమా ప్రారంభోత్స‌వం జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 5 నుంచే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది.

సినిమా ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా కాస్ట్ అండ్ క్రూ గురించి కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఈ చిత్రంలో వెంకీ స‌ర‌స‌న మీనానే న‌టించ‌నుండ‌గా.. చిన్న‌మ్మాయిగా ఒరిజిన‌ల్లో న‌టించిన ఎస్తేర్ అనిలే క‌నిపించ‌నుంది. పెద్ద‌మ్మాయి పాత్ర‌కు కొత్త న‌టిని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దృశ్యంలో కృతిక జ‌యకుమార్ ఆ పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఒక తెలుగు దృశ్యంలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించిన న‌దియా, న‌రేష్‌.. దృశ్యం-2లోనూ న‌టించ‌నున్నారు.

ఇక టెక్నీషియ‌న్స్ విష‌యానికి వ‌స్తే.. ఆశ్చ‌ర్య‌క‌రంగా అనూప్ రూబెన్స్‌ను సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపిక చేశారు. ఒక‌ప్పుడు పెద్ద సినిమాల‌తో కొన్నేళ్ల పాటు హ‌వా న‌డిపించిన అనూప్.. కొంత కాలంగా అంత‌గా ఫామ్‌లో లేడు. మ‌ధ్య‌లో ఒక‌ట్రెండేళ్లు అత‌ను క‌నిపించకుండా పోయాడు. ఈ మ‌ధ్య 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా లాంటి చిన్న సినిమాతో ప‌ర్వాలేద‌నిపించాడు. అత‌ణ్ని ఇలాంటి థ్రిల్ల‌ర్ మూవీకి ఎంపిక చేయ‌డం విశేష‌మే. మ‌రి బ్యాగ్రౌండ్ స్కోర్ కీల‌కం అయిన ఈ సినిమా కోసం అనూప్ ఎలాంటి ఔట్ పుట్ ఇస్తాడో చూడాలి.

దృశ్యం-2 ఒరిజిన‌ల్‌ను నిర్మించిన ఆంటోనీ పెరుంబ‌వూర్ తెలుగు వెర్ష‌న్‌లోనూ నిర్మాణ భాగ‌స్వామిగా ఉన్నారు. ఆయ‌న‌తో క‌లిసి సురేష్ బాబు, రాజ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. జూన్ నెల‌లోనే ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తేవాల‌ని చూస్తున్నారు. నెల‌న్న‌ర‌లో షూటింగ్ పూర్తి చేస్తారట‌.