సౌత్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలే


ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఓ సౌత్ సినిమా పోటీగా నిలిస్తే.. హిందీ సినిమా నిర్మాత గగ్గోలు పెట్టే పరిస్థితి వస్తుందని కొన్నేళ్ల ముందు వరకు ఎవరూ ఊహించి ఉండరు. ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా తిరుగులేని మార్కెట్ సంపాదించుకున్న రాజమౌళి తీస్తున్న కొత్త సినిమా ‘ఆర్ఆర్ఆర్’ను దసరా సీజన్లో తన సినిమా ‘మైదాన్’కు పోటీగా నిలిపారని బోనీ కపూర్ ఎంత ఆక్రోశానికి గురయ్యాడో తెలిసిందే. రాజమౌళి రేంజ్ ఎలా పెరిగిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

కేవలం రాజమౌళి సినిమా అనే కాదు.. ఇప్పుడు సౌత్ సినిమాలంటేనే బాలీవుడ్ భయపడే పరిస్థితి కనిపిస్తోంది. తెలుగులో ప్రభాస్ ఏ సినిమా చేసినా.. ఇప్పుడు ఉత్తరాదిన వసూళ్ల మోత మోగిస్తోంది. అలాగే తమిళం నుంచి రజినీకాంత్, విజయ్, సూర్య సినిమాలు సౌత్ ఉత్తరాదిన మంచి ప్రభావమే చూపిస్తున్నాయి కొన్నేళ్లుగా. ఇప్పుడు కొత్తగా కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా పోటీ తప్పట్లేదు.

‘కేజీఎఫ్’ సినిమా ఉత్తరాదిన ఎలా వసూళ్ల మోత మోగించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్న ‘కేజీఎఫ్-2’ మీదా నార్త్‌లో భారీ అంచనాలున్నాయి. ఆ సినిమాకు పోటీగా నిలబడ్డానికి హిందీ సినిమాలు వెనుకంజ వేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ద్వితీయార్ధంలో సౌత్ సినిమాల దెబ్బకు బాలీవుడ్ బెంబేలెత్తిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

ముందుగా జులై 16న ‘కేజీఎఫ్-2’ బరిలోకి దిగుతోంది. దాని దూకుడు కొనసాగుతుండగానే.. ప్రభాస్ కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’ వచ్చేస్తుంది. ఆ చిత్రం జులై 30న రిలీజవుతుంది. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో పెద్ద ఎత్తున రిలీజయ్యే సినిమానే. ఇంకో రెండు వారాల్లోపే ‘పుష్ప’ను రిలీజ్ చేయబోతున్నారు. గత కొన్నేళ్లలో డబ్బింగ్ సినిమాలతోనే అల్లు అర్జున్ ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. ‘పుష్ప’తో నార్త్‌లో అతను గట్టి ప్రభావమే చూపిస్తాడని అంచనా వేస్తున్నారు. ఇక దసరా సీజన్లో ‘ఆర్ఆర్ఆర్’ ఎలాగూ ఉండనే ఉంది. మరోవైపు జులై తొలి వారంలో రానున్న ‘మేజర్’ సినిమా నార్త్ వాళ్లకు బాగా కనెక్ట్ అయ్యే 26/11 దాడుల నేపథ్యంలో తెరకెక్కింది కాబట్టి.. అది కూడా నార్త్ బాక్సాఫీస్ దగ్గర మంచి ప్రభావమే చూపుతుందని అంచనా వేస్తున్నారు.