ఖైదీ సేతుపతి చేసి ఉంటే..?

తమిళ స్టార్ హీరో కార్తి కెరీర్లో బెస్ట్ అనదగ్గ చిత్రాల్లో ఖైదీ ఒకటి. లోకేష్ కనకరాజ్ ను సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడిగా మార్చింది ఈ చిత్రమే. న్యూ ఏజ్ ఫిలిం మేకింగ్ తో ఈ సినిమాను వేరే స్థాయిలో నిలబెట్టాడు లోకేష్. ఈ సినిమాతో కార్తి లెవెల్ మారిపోయింది. తన పెర్ఫార్మెన్స్ మాములుగా పేలలేదు. డిల్లీ పాత్రను తనకంటే బాగా ఇంకెవరు చెయ్యలేరేమో అనేలా ఆ పాత్రను పండించాడు కార్తి. ఐతే నిజానికి ఈ కథ ముందు వెళ్ళింది కార్తి దగ్గరికి కాదట.

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఒరిజినల్ గా ఖైదీ అవతారం ఎత్తాల్సిందట. ఈ కథను మొదట సేతుపతికే చెప్పి ఆయనతోనే సినిమా చెయ్యాలనుకున్నాడట లోకేష్ కనకరాజ్. కార్తీకి ఈ కథ తెగ నచ్చేసి తనే సేతుపతి అడిగి మరీ ఈ ప్రాజెక్టును తీసుకున్నాడట. ఈ విషయాన్ని సేతుపతి స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఐతే ఆ సినిమా మిస్ అయినందుకు తనకు బాధేమి లేదని సేతుపతి స్పష్టం చేశాడు.

“ఖైదీ సినిమా ముందు నా దగ్గరకే వచ్చింది. ఆ ప్రాజెక్ట్ గురించి చర్చలు కూడా జరిగాయి. కానీ ఫైనల్ అవ్వలేదు. కార్తి ఆ సినిమా చేయాలనుకున్నారు. ఆయన నాకు ఫోన్ చేసి, ‘యోవ్ వీఎస్, నేను చేస్తానయ్యా’ అన్నారు. అందుకు నేను ‘చాలా బాగా చేయండి సర్’ అని చెప్పాను. దాని గురించి నాకు ఎలాంటి బాధా లేదు.

లోకేష్ కనకరాజ్ నాకు బాగా తెలుసు. అతను నాకు బ్రదర్ లాంటి వాడు. కార్తి పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. కథ విన్నప్పుడే ఈ సినిమా విజయం సాధిస్తుందని నాకు అర్థమైంది. తమిళం, తెలుగులో ఈ సినిమా చాలా బాగా ఆడుతుందని కూడా వాళ్లతో చెప్పాను. ఇది అద్భుతమైన సినిమా, మంచి సినిమా. కానీ మంచి సినిమాను నేను కోల్పోయానని నేను బాధ పడడం లేదు” అని సేతుపతి అన్నాడు.

ఖైదీ సినిమాలో కార్తి కాకుండా ఇంకొకరిని ఊహించుకోలేం కానీ.. సేతుపతి కూడా గొప్ప నటుడు, తనకూ ఈ పాత్ర బాగానే సూటయ్యేది కాబట్టి అతను చేసినా ఈ సినిమా సక్సెస్ అయ్యేది అనడంలో సందేహం లేదు. కాకపోతే కార్తీకి ఉన్న స్టార్ ఇమేజ్ వల్ల దాని రేంజ్ ఇంకా పెరిగింది.