కొన్ని నెలల క్రితం టీజర్ వచ్చినప్పుడు ట్రోలింగ్ కు గురైన రామాయణ పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తోంది. ఓవర్సీస్ లోనీ కీలకమైన నార్త్ అమెరికాలో ఏకంగా దురంధర్ రివెంజ్ రికార్డుని తుడిచిపెట్టేసి 29 మిలియన్ మార్కుని దాటేయడం పట్ల డిస్ట్రిబ్యూషన్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. నార్త్ అమెరికా మార్కెట్ లో ఇది సరికొత్త మైలురాయి. వరల్డ్ వైడ్ 1700 కోట్ల గ్రాస్ దాటేసి రెండు వేలని టార్గెట్ గా పెట్టుకున్న ఈ ఎపిక్ డ్రామా ఫైనల్ థియేటర్ రన్ లోపల దాన్ని సాధ్యం చేసుకునేలా ఉంది.
సరే నెంబర్ల సంగతి కాసేపు పక్కన పెడదాం. రెండేళ్ల తర్వాత విడుదల కాబోయే రామాయణ పార్ట్ 2కి ఇప్పుడీ విజయం వేసిన పునాది ఎంత వరకు ఉపయోగపడుతుందనే కోణంలో బాలీవుడ్ విశ్లేషకులు రకరకాల భాష్యాలు చెబుతున్నారు. ఇంకా హనుమంతుడి ఎంట్రీ జరగలేదు. రామ రావణ యుద్ధం సీక్వెల్ లో ఉంటుంది. రామసేతు నిర్మాణం, సంజీవని పర్వతం లాంటి ఎన్నో కీలకమైన ఎపిసోడ్స్ పార్ట్ 2 కోసం దాచి ఉంచారు. విఎఫ్ఎక్స్ కూడా పెద్ద ఎత్తున అవసరం పడుతుంది. అంచనాలు కూడా అంతే ఉంటాయి.
ఒకరకంగా చెప్పాలంటే బాహుబలి రేంజ్ లో పార్ట్ 2 మీద విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కలిగించిందా అంటే లేదనే చెప్పాలి. అయితే బిజినెస్ పరంగా డిమాండ్ సృష్టించడంలో సక్సెస్ అయ్యింది. కలెక్షన్లను ఎక్కువ చేసి చూపించారని, గ్రౌండ్ లెవెల్ లో అంత స్థాయిలో వసూళ్లు లేవని కొందరు క్రిటిక్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నప్పటికీ రామాయణ అంకెలు చాలా స్టడీగా ఉన్నాయి. మంగళవారం 99 రూపాయల ఆఫర్ వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో అనూహ్యమైన పికప్ వచ్చింది.
ఇంకా చాలా టైం ఉంది కాబట్టి రామాయణ పార్ట్ 2 మీద ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ధారణకు రాలేం కానీ ఒక పాజిటివ్ వాతావరణాన్ని సృష్టించడంలో నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేశ్ తివారి సఫలీకృతులయ్యారు. ఆస్కార్ రేసులో నిలబడుతున్న రామాయణ మరి ఆ గౌరవాన్ని అందుకుంటుందో లేక ఆర్ఆర్ఆర్ లాగా ఏదో ఒక విభాగంతో సరిపుచ్చుకుంటుందో వేచి చూడాలి. రామాయణ 2కి సంబంధించిన షూటింగ్ గతంలో సగంపైనే అయ్యిందట. త్వరలోనే మిగిలిన భాగం పూర్తి చేయబోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates