తండేల్ సూపర్ హిట్ తర్వాత నాగచైతన్యకి గ్యాప్ వచ్చేసింది. కారణం వృషకర్మ. ప్యాన్ ఇండియా బడ్జెట్ తో కెరీర్ లోనే మొదటిసారి ఇంత విఎఫ్ఎక్స్ ఉన్న సినిమా చేయడంతో ఎక్కువ సమయం కేటాయించాడు. విరూపాక్షతో ఇండస్ట్రీని, ఆడియన్స్ ని మెప్పించిన దర్శకుడు కార్తీక్ దండు ఈసారి ఇంకా పెద్ద కాన్వాస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ట్రైలర్ లాంచ్ నిన్నే జరిగింది కానీ ఆన్ లైన్ వెర్షన్ ఇవాళ వదిలారు. మూడు నిమిషాలకు దగ్గరగా ఉన్న వీడియోలో కథేంటో చెప్పేశారు.
ప్రపంచ వినాశనానికి పూనుకున్న ఒక దుష్టశక్తి దాన్ని నిజం చేసుకోవడం కోసం బలివ్వడానికి ఒక చిన్న పాపను ఎంచుకుంటుంది. ఇంకోవైపు అయిదు వేల సంవత్సరాల వెనుకటి అవశేషాలు కొన్ని పురావస్తు శాఖకు దొరుకుతాయి. దీని వెనుక ఏదో ప్రమాదం ఉందని భావించిన అధికారి (జయరామ్) దాన్ని ఛేదించడం కోసం డబ్బులు తీసుకునే సాహసికుడి (నాగచైతన్య) సహాయం కోరతాడు. ముందు తేలికని భావించిన పని క్రమంగా ముప్పుగా మారుతుంది. అసలు వృషకర్మ అంటే ఏంటనేది తెరమీద చూడాలి.
దర్శకుడు కార్తీక్ దండు ఎలాంటి అదనపు హంగులు లేకుండా, కమర్షియల్ ఎలిమెంట్స్ మీద దృష్టి పెట్టకుండా వృషకర్మని ఒక జెన్యూన్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ గా మార్చడం కోసం చాలా కష్టపడిన వైనం విజువల్స్ లో కనిపిస్తుంది. హాలీవుడ్ తరహా స్టాండర్డ్ ని మ్యాచ్ చేసేందుకు క్వాలిటీ విఎఫ్ఎక్స్ తో పాటు సన్నివేశాల్లోని ఘాడతని నింపడం ద్వారా ఒక రకమైన ఆసక్తిని రేపారు. దాదాపు సినిమా మొత్తం స్టన్నింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చైతు చెప్పిన మాటల్లో నిజం ఉందనిపిస్తోంది.
డిసెంబర్ 4 విడుదల కాబోతున్న వృషకర్మ అంచనాలు పెంచేందుకు ఈ ట్రైలర్ దోహదపడుతుంది. నాగ చైతన్యకి పెర్ఫార్మన్స్ పరంగానే కాకుండా యాక్షన్ విషయంలోనూ రిస్కులు తీసుకునేలా చేసిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. విలన్ గా నటించిన స్పర్శ్ శ్రీవాత్సవ భయపెట్టేలా ఉన్నాడు. పూర్తిగా కంటెంట్ మీద ఆధారపడిన వృషకర్మకు బాక్సాఫీస్ వద్ద అలియాస్ రుక్మిణి తప్ప పెద్దగా పోటీ లేదు. టాక్ వస్తే చాలు చైతు ఖాతాలో ఇంకో విజయం చేరినట్టే.
Gulte Telugu Telugu Political and Movie News Updates