విడుద‌ల‌కు ముందే బ్లాక్ బ‌స్ట‌ర్ పార్టీ

నేచుర‌ల్ స్టార్ నానికి హీరోగా కంటే నిర్మాత‌గా ఎక్కువ క్రెడిబిలిటీ ఉంది అంటే అతిశ‌యోక్తి కాదు. తాను హీరోగా న‌టించినా, లేదా బ‌య‌టి వాళ్లు చేసినా స‌రే.. అత‌ను ప్రొడ్యూస్ చేసిన సినిమాల‌న్నీ ఇప్ప‌టిదాకా మంచి ఫ‌లితాలే అందుకుంటూ వ‌చ్చాయి. అ!, హిట్, హిట్-2, కోర్ట్, హిట్-3..ఈ సినిమాల వ‌ర‌స చూస్తేనే విష‌యం అర్థ‌మైపోతుంది. ఇప్పుడు నాని ప్రొడ‌క్ష‌న్లో అలియాస్ రుక్మిణీ అనే సినిమా తెరకెక్కింది.

నాని స‌మ‌కాలీన హీరో నితిన్ ఇందులో లీడ్ రోల్ చేయ‌గా.. బాలీవుడ్ భామ ఆఫియా స‌య్య‌ద్ క‌థానాయిక‌గా న‌టించింది. దండోరా లాంటి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన ముర‌ళీకాంత్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. డిసెంబ‌రు 4న అలియాస్ రుక్మిణీ రిలీజ్ కానుండ‌గా.. ఈ చిత్ర బృందం తాజాగా ఒక పెద్ద పార్టీ చేసుకుంది. అదేమీ సినిమా పూర్త‌యినందుకు చేసుకున్న రాప‌ప్ పార్టీ కాద‌ట‌. బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్ట‌బోతున్నామ‌ని ముందే ఇలా సెల‌బ్రేట్ చేసుకున్నార‌ట‌.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా నానినే వెల్ల‌డించాడు. ”సాంగ్ లాంచ్ పార్టీ.. రాప‌ప్ పార్టీ.. కాదిది బ్లాక్ బ‌స్ట‌ర్ పార్టీ.. సినిమా రిలీజ్ త‌ర్వాతస‌క్సెస్ పార్టీలు జోక్ అయిపోయిన ఈ రోజుల్లో సినిమా రిలీజ్‌కు ముందే బ్లాక్ బ‌స్ట‌ర్ పార్టీ చేసుకుంటున్న ఒకే ఒక్క సినిమా అలియాస్ రుక్మిణి అంటూ ఈ చిత్రం” మీద త‌న‌కున్న న‌మ్మ‌కాన్ని చాటే స్టేట్మెంట్ ఇచ్చాడు నేచుర‌ల్ స్టార్.

నాని ఊరికే త‌న సినిమాల గురించి గొప్ప‌లు పోతూ మాట్లాడే ర‌కం కాదు. కోర్టు సినిమా న‌చ్చ‌క‌పోతే హిట్-3 చూడొద్దు అంటూ ధీమాగా ప్ర‌క‌టించి.. ఆ సినిమాతో గొప్ప‌ ప్ర‌శంస‌లు అందుకున్న ఘ‌న‌త నానిది. ఇప్పుడు అలియాస్ రుక్మిణీ గురించి కూడా నాని ఇంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నాడంటే బాక్సాపీస్ ద‌గ్గ‌ర గ‌ట్టిగా కొట్ట‌బోతున్నాడ‌నే అనుకోవాలి. చాలా ఏళ్ల నుంచి స‌రైన విజ‌యం లేక ఇబ్బంది ప‌డుతున్న నితిన్ ఈ సినిమా మీద చాలా ఆశ‌లే పెట్టుకున్నాడు. మ‌రి ఇప్పుడు జ‌రిగిన బ్లాక్ బ‌స్ట‌ర్ పార్టీకి సార్థ‌క‌త చేకూరేలా సినిమా ఘ‌న‌విజయాన్నందుకుంటుందేమో చూడాలి.